Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారు స‌మ‌ర్పించు.. సొంత మ‌ద్యం షాపులు

By:  Tupaki Desk   |   19 July 2019 5:24 AM GMT
ఏపీ స‌ర్కారు స‌మ‌ర్పించు.. సొంత మ‌ద్యం షాపులు
X
ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీల అమ‌లు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు ఎంత క‌చ్ఛితంగా ఉందో తెలిసిందే. ప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి వ‌చ్చి నెల‌న్న‌ర మాత్ర‌మే అవుతున్నా.. పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు తీస్తున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌మ ఎజెండాలో భాగంగా మ‌ద్యం దుకాణాల్ని వీలైనంత‌గా త‌గ్గించ‌టం.. మ‌ద్యం తాగే అల‌వాటును క‌ట్ట‌డి చేయాల‌న్న మ‌హా సంక‌ల్పాన్ని అమ‌లు చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ మ‌ద్యం దుకాణాల‌కు టెండ‌ర్లు పిలిచి.. వారికి ఆ బాధ్య‌త అప్ప‌గించి.. వారిచ్చే లైసెన్స్ ఫీజుల‌తో ఆదాయాన్ని స‌మ‌కూర్చుకునే ప్ర‌భుత్వ విధానానికి భిన్నంగా జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే ఏపీలో ఉన్న షాపుల సంఖ్య‌ను భారీగా త‌గ్గించ‌నుంది. ప్ర‌స్తుతం ఏపీలో 4380 మ‌ద్యం దుకాణాలు ఉంటే.. వాటిల్లో 800 నుంచి 1300 వ‌ర‌కు త‌గ్గిస్తారు.

ఇప్ప‌టికే ఈ విధానంపై ఏపీ కేబినెట్ లో నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే కాదు.. అసెంబ్లీలో బిల్లు ప్ర‌వేశ పెట్టి.. దీనికి స‌ర్కారు ఆమోదముద్ర వేయ‌నుంది. ఇప్పుడున్న చ‌ట్టాన్ని స‌వ‌రించి కొత్త విధానాన్ని అక్టోబ‌రు 1 నుంచి అమ‌ల్లోకి తీసుకురానున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ ప్రైవేటు వ్య‌క్తులు నిర్వ‌హించిన మ‌ద్యం దుకాణాల్ని ప్ర‌భుత్వ‌మే సొంతంగా నిర్వ‌హిస్తుంది. ఈ కార‌ణంగా ఆదాయం త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మ‌ద్యానికి బానిస‌లు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తోడ్పాటును ఇచ్చే వీలుంది.

అంతేకాదు.. మ‌ద్యం ధ‌ర‌ల్ని భారీగా పెంచేస్తారు. ఇక‌.. షాపుల వారికి ఇచ్చే మార్జిన్ల‌ను క‌లుపుకుంటే.. ప్ర‌భుత్వానికి ఆదాయం కాస్త త‌గ్గినా.. ప్ర‌జ‌ల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గే వీలుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల్ని న‌డ‌ప‌టం కార‌ణంగా రూల్ ప్ర‌కారం షాపుల్ని తెరిచి.. షాపుల్ని క‌చ్ఛితంగా మూసేస్తుంటారు. దీని కార‌ణంగా మ‌ద్య నిషేధం దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేసే అవ‌కాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ విధానంలో బెల్ట్ షాపుల బెడ‌దే ఉండ‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఏపీ ప్ర‌జ‌ల మంచి కోరి సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్ ను అభినందించాల్సిందే. అదే స‌మ‌యంలో మందుబాబుల‌కు తాజా నిర్ణ‌యం చేదువార్త‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.