Begin typing your search above and press return to search.

అక్కడ గురజాడ అడుగుజాడ

By:  Tupaki Desk   |   16 Jan 2022 3:30 PM GMT
అక్కడ గురజాడ అడుగుజాడ
X
తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం వంటి అభ్యుదయ రచనను చేసిన మహాకవి గురజాడ అప్పారావు అచ్చమైన ఉత్తరాంధ్రా సొత్తు. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఆస్తి. నాడు పూసపాటి సంస్థానధీశులు ఆయన్ని చేరదీసి ఎన్నో రచనలు చేయించారు. అలా తెలుగు సాహిత్యాన్ని గురజాడ పరిపుష్టి చేశారు. ఆయన గట్టిగా యాభై ఏళ్ళు మాత్రమే బతికారు కానీ చిరకీర్తిని ఆర్జించారు. అలాంటి గురజాడ మన వాడు అని కవులు సాహితీ వేత్తలు అనుకోవడమే తప్ప ఆయన పేరున ఏదీ నికరంగా విజయనగరంలో ఏ సంస్థకూ పెట్టలేదు.

అటువంటి గురజాడకు ఇపుడు మంచి గౌరవమే దక్కింది అనుకోవాలి. కాకినాడ జే ఎన్ టీయూ కి అనుబంధంగా వైఎస్సార్ హయాంలో ఒక కాలేజీగా విజయనగరంలో ఏర్పాటు అయిన సాంకేతిక కళాశాలను విశ్వవిద్యాలయంగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆ యూనివర్శిటీకి గురజాడ అప్పారావు పేరుని పెట్టింది.

దీంతో కవులు సాహితీవేత్తలే కాదు, ఉత్తరాంధ్రాలోని వారంతా హర్షిస్తున్నారు. ఆ మహానుభావుడి అడుగు జాడలు యువతకు స్పూర్తి అని కొనియాడుతున్నారు. ఇక ఉత్తరాంధ్రాలో సాంకేతిక విద్య అన్నది అందని పండుగా మారిన తరుణంలో నేరుగా సాంకేతిక విశ్వ విద్యాలయం విజయనగరంలో ఏర్పాటు కావడం వల్ల వెనకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుంది అని విద్యావేత్తలు అంటున్నారు.

దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విజయనగరం జే ఎన్ టీ యూ కాలేజి కి వర్శిటీ హోదా రావడం ఆనందకరమని అన్నారు. దానికి గురజాడ అప్పారావు పేరు పెట్టడం చాలా సముచిత నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. ప్రతీ జిలాకు ఒక వర్శిటీ ఉండాలని ఆయన అన్నారు. ఇక పేదలు పెద్ద చదువులు చదవాలన్నది వైఎస్సార్ కోరిక అని, అది ఇపుడు తీరుతోందని విజయసాయిరెడ్డి అన్నారు.