Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి షాక్.. 'కత్తి' కేసు ఎన్ ఐఏ చేతికి..

By:  Tupaki Desk   |   4 Jan 2019 6:40 AM GMT
ఏపీ ప్రభుత్వానికి షాక్.. కత్తి కేసు ఎన్ ఐఏ చేతికి..
X
ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన అటు ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. జగన్ పై దాడి కేసును ఎన్ ఐఏకు అప్పగించాలని దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం విచారించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ ఐఏకు అప్పగిస్తూ శుక్రవారం సంచలనం నిర్ణయం తీసుకుంది.

జగన్ పై దాడిని ఏపీ ప్రభుత్వం కేవలం పబ్లిసిటి కోసమే జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ వస్తోంది. దాడి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అభిమాని అని, జగన్ పై సానుభూతి వచ్చేందుకే దాడి జరిగిందని పోలీసులు - ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది.

దీనిపై వైఎస్సాఆర్ సీపీ నాయకులు ఏపీ ప్రభుత్వం - పోలీసుల తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం కేసును పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. మరోవైపు జగన్ పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వం - ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై జగన్ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం జగన్ పై దాడి కేసును హైకోర్టు విచారించింది. ఈ కేసును కుట్రకోణంలో ఏపీ పోలీసులు దర్యాప్తు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును ఇప్పటికే ఎన్ఐఏ సుమెటోగా విచారణకు తీసుకోవాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇకపై ఈ కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం జోక్యం ఉండకూడదని స్పష్టం చేసింది.

ఈ కేసును ఎన్ ఐఏకు అప్పగించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీనిపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. నిజనిజాలు బయటకు రావాలంటే ఎన్ ఐఏ దర్యాప్తు చేయడమే మంచిదని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలపై వైఎస్ ఆర్ సీపీ నాయకులు స్వాగతించారు. మొదటి నుంచి తాము కోరుతున్నట్లు ఎన్ ఐఏ దర్యాప్తుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం ఈ కేసుపై ఎలా ముందుకు పోతుందో వేచి చూడాల్సింది ఉంది.