Begin typing your search above and press return to search.

ఒకే దెబ్బ‌కు అనేక పిట్ట‌లు.. జ‌గ‌న్ అనుకుంటే అయిపోద్దా?

By:  Tupaki Desk   |   27 Jan 2020 6:08 AM GMT
ఒకే దెబ్బ‌కు అనేక పిట్ట‌లు.. జ‌గ‌న్ అనుకుంటే అయిపోద్దా?
X
ఏపీ శాస‌న‌మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక ర‌కంగా సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌నే చేప‌ట్టారు. మండ‌లిలో మ‌రి కొన్నాళ్లకు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వ‌స్తుంద‌నే విశ్లేష‌ణ‌లు, మండ‌లి ర‌ద్దు ఏపీ ప్ర‌భుత్వం అనుకోగానే అయిపోద‌నే అడ్డుపుల్ల‌లు.. వీట‌న్నింటి నేప‌థ్యంలో కూడా జ‌గ‌న్ మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్నే తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క వ్య‌తిరేక స్వ‌రం కూడా ఇప్పుడు వినిపించ‌లేదు!

అందుకు అనేక కార‌ణాలున్నాయి. వైసీపీ కి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వారంతా ప‌ద‌వుల్లో ఉన్నారు. కాబ‌ట్టి.. మండ‌లి ర‌ద్దు అయినా ఆ పార్టీ నేత‌ల‌కు న‌ష్టం లేదు. కొంద‌రు ఎన్నిక‌ల్లో ఓడిన రాజ‌కీయ నిరుద్యోగులు అయితే ఉన్నారు. అలాంటి వారెవ‌రూ ఇప్పుడు బ‌య‌ప‌డ‌లేరు. కానీ జ‌గ‌న్ కేబినెట్లో ఇద్ద‌రు మంత్రులు ఇప్పుడు ప‌ద‌వులు కోల్పోవాల్సి ఉంటుంది. నోట్ దిస్ పాయింట్!

ఆ సంగ‌త‌లా ఉంటే.. జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి కేంద్రం ఆమోద ముద్ర ప‌డుతుందా? అనేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఈ తీర్మానాన్ని కేంద్రం వ్య‌తిరేకించ‌దు. ఎందుకంటే.. మండ‌లి ఉండాలా వ‌ద్దా అనేది రాష్ట్రాల ఇష్టం. ఉండాలంటే ఉంచ‌డం, వ‌ద్దంటే ఎత్తేయ‌డం ఇదీ కేంద్రానికి ఉన్న అధికారం. ఆ మేర‌కు ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పంపిన తీర్మానానికి కేంద్రం ఆమోదం ల‌భిస్తుంది. అయితే అదెప్పుడు? అనేదే సందేహం!

ఒక‌వేళ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే మండ‌లి ర‌ద్దు తీర్మానానికి కేంద్రం ఆమోద ముద్ర వ‌స్తే.. జ‌గ‌న్ కు ఢిల్లీలో తిరుగులేన‌ట్టే. అప్పుడు ఒకే దెబ్బ‌కు అనేక పిట్ట‌లు రాలిన‌ట్టే. ఏ మండ‌లి ని చూసుకుని చంద్ర‌బాబు నాయుడు అహంకార రాజ‌కీయం చేశారో దానికి దెబ్బ ప‌డుతుంది. అలాగే జ‌గ‌న్ కు ఢిల్లీలో ప‌ర‌ప‌తి ఉంద‌ని రుజువు అవుతుంది. మూడు రాజ‌ధానుల ఫార్ములాకూ ఊతం ల‌భించిన‌ట్టే! ఇలా మండ‌లి ర‌ద్దు తీర్మానం పార్ల‌మెంట్ లో ఆమోదం పొంద‌డంతో.. జ‌గ‌న్ ఒకే దెబ్బ‌కు అనేక పిట్ట‌ల‌ను కొట్టిన‌ట్టుగా అవుతుంది. ఒక‌వైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి బీజేపీ తో చేతులు క‌లిపాడు. ఇలాంటి స‌మ‌యంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీర్మానానికి కేంద్రం ట‌క్కున ఆమోద‌ముద్ర వేస్తే.. ప‌వ‌న్ కు కూడా గ‌ట్టి ఝ‌ల‌క్ అవుతుంది!

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశాలు మ‌రిన్ని ఉన్నాయి. గ‌త కొంత‌కాలంలో కేంద్రం లో బీజేపీ వాళ్లు ప్ర‌వేశ పెట్టిన ప‌లు బిల్లుల‌కు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలిచింది. బీజేపీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం అంత‌గా లేని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డ వైసీపీ అండ‌గా ఉంటూ ఉంది. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం కూడా పెర‌గ‌నుంది. ఇలాంటి నేప‌థ్యం లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పంపించిన బిల్లుకు అక్క‌డి బీజేపీ వారు కూడా మ‌ద్ద‌తు ప‌ల‌క‌వ‌చ్చు. మండ‌లి
ర‌ద్దు కు ఓకే చెప్ప‌వ‌చ్చు. ఇదొక విశ్లేష‌ణ‌.

అలా కాకుండా.. తెలుగుదేశం వాళ్లు భ‌య‌ పెట్టిన‌ట్టుగా, ఆ పార్టీ వాళ్లు చెబుతున్న‌ట్టుగా మండ‌లి ర‌ద్దు రెండు మూడేళ్లు ప‌డితే మాత్రం జ‌గ‌న్ కు అది ఎదురుదెబ్బే అవుతుంది. కానీ అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని, కేంద్రంలో ఆమోదం ల‌భిస్తుంద‌నే విశ్వాసంతోనే జ‌గ‌న్ ఈ విష‌యం లో గ‌ట్టిగా ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలూ వ్య‌క్తం అవుతున్నాయి.