Begin typing your search above and press return to search.

ఎల్‌ జీ రావ‌ట‌మేమో కానీ హ‌డావుడి అదిరింది

By:  Tupaki Desk   |   7 Dec 2017 5:04 AM GMT
ఎల్‌ జీ రావ‌ట‌మేమో కానీ హ‌డావుడి అదిరింది
X
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నంతగా ప్ర‌చారం మొద‌లైంది. అస‌లేమి ఉన్నా లేకున్నా.. ఏదో జ‌రిగిపోతున్న భావ‌న క‌లిగించ‌టం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. మ‌రి.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ధోర‌ణి పెరుగుతోంది. దీనికి తోడు ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు తానా అంటే తందానా అన్న‌ట్లుగా అధికార ప‌క్షానికి వంత పాడ‌ట అంత‌కంత‌కూ పెరుగుతోంది.

గ‌తంలో ప్ర‌భుత్వానికి అస‌లుసిస‌లు ప్ర‌తిప‌క్షం మీడియా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. అది త‌మ బాధ్య‌త‌గా చెప్పుకునే వారు. ఇప్పుడు మీడియా రూల్స్ మారిపోయాయి. అధికార‌ప‌క్షానికి అస‌లుసిస‌లు పీఆర్వో అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి పెరిగిపోయింది. ప్ర‌భుత్వానికి ప్ర‌భుత్వం సైతం తాము చేసిన ప‌నుల గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి మిన్న‌గా వార్త‌ల్ని వండి వ‌డ్డించ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది.

వార్త‌ల్ని చ‌ద‌వినంత‌నే క‌ల‌ల ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిపోవ‌ట‌మేకాదు.. రాబోయే రోజుల్లో జ‌ర‌గ‌బోయే అభివృద్ధి ఎంత‌లా ఉంటుంద‌న్న సినిమాను 70ఎంఎంలో చూపిస్తున్న వైనం ఈ మ‌ధ్య‌న మోతాదు మించుతోంది. మీడియాకు స‌హ‌జంగా ఉండే ప్ర‌శ్నించే త‌త్త్వాన్ని పాత‌రేయ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

త‌న నాలుగేళ్ల పాల‌న‌లో ఏపీ ముఖ్య‌మంత్రి ఎన్ని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి త‌ప్ప‌నిస‌రిగా ఫారిన్ టూర్ పెట్టుకునే చంద్ర‌బాబు కార‌ణంగా వ‌చ్చిన పెట్టుబ‌డుల కంటే అయిన ఖ‌ర్చు భారం ఎక్కువ‌ని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చుర‌క‌లు వేస్తుంటారు. తాజాగా ఆయ‌న ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

మూడు రోజుల కొరియా ప‌ర్య‌ట‌న‌తో ఏపీకి ఏం లాభం క‌లుగుతుందోన‌న్న ఆస‌క్తితో తెలుగు ప్ర‌జ‌లు చూశారు. ఇప్ప‌టికే ఏపీకి వ‌చ్చిన కియో మోటార్స్ కు సంబంధించిన వార్త‌లు త‌ప్పించి.. మ‌రే సంస్థా ఏపీ వైపు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి వేళ‌.. కొత్త హ‌డావుడి మొద‌లైంది. ఎల‌క్ట్రానిక్స్ లో దిగ్గ‌జ సంస్థ అయిన ఎల్ జీ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించింది. ఒక‌వేళ‌.. ఇది వాస్త‌వ రూపం దాల్చి ఎల్ జీ కానీ ఏపీలో ఫ్లాంట్ ఓపెన్ చేస్తే మంచే జ‌రుగుతుంది. కానీ.. ప్ర‌తిపాద‌న ప్రాధ‌మిక ద‌శ‌లో ఉన్నప్పుడు ఎల్ జీ సంస్థ ఏపీకి వ‌చ్చేసినంతగా భారీ హెడ్డింగ్ లు పెట్టేసి వార్త‌లు వేయ‌టమే ఆశ్చ‌ర్య‌క‌రం.

వాస్త‌వానికి బుధ‌వారం జ‌రిగిందేమిటి? చ‌ంద్ర‌బాబు త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం సియోల్ లో ఎల్ జీ ఎల‌క్ట్రానిక్స్ అధ్య‌క్షుడు సూన్ క్వోన్ తోనూ.. ఇత‌ర పారిశ్రామివేత్త‌ల‌తోనూ స‌మావేశ‌మ‌య్యారు. మీటింగ్ అయ్యే స‌మ‌యానికి మిగిలిన పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పోలిస్తే.. ఎల్ జీ అధ్య‌క్షుడు కూసింత ఎక్కువ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించి ఉంటారు. తెలుగోళ్ల‌కు బాగా ప‌రిచ‌య‌మున్న ఎల్ జీ పేరును ఆ రోజుకు వాడేస్తే పోలా అని బాబు బ్యాచ్ లోని మీడియా స‌ల‌హాదారుకు ఐడియా వ‌చ్చేసి ఉంటుంది. అంతే.. ఆ యాంగిల్ లో ప్రెస్ నోట్ రెఢీ అయిపోయి ఉంటుంది.

ద‌క్షిణ కొరియాలో త‌యారైన ప్రెస్ నోట్‌.. ఏపీలోని మీడియా ఆఫీసుల్లోకి వ‌చ్చినంత‌నే.. దాన్ని ఏ విధంగా తీర్చి దిద్దాలో ఆ ర‌కంగా తీర్చిదిద్దేశారు. దీని ఫ‌లిత‌మే.. ఈ రోజు వ‌చ్చిన ఎల్ జీ భారీ వార్త‌. జ‌స్ట్ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తేనే.. ఇంత భారీ ప్ర‌చార‌మైతే.. ఇక ఏకంగా ఎల్ జీ వ‌స్తాన‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తే మ‌రెంత సంద‌డి చేస్తారో. ఏమైనా.. బాబుకు సుడే సుడి. పైసా ప్ర‌య‌త్నం జ‌రిగితే రూపాయి ప‌ని జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఎంత‌మంది ముఖ్య‌మంత్రుల‌కు ల‌భిస్తుంది చెప్పండి?