Begin typing your search above and press return to search.

హైదరాబాద్ క్వార్టర్స్ కి ఏపీ ఎమ్మెల్యేల ‘నో’

By:  Tupaki Desk   |   4 Sept 2015 10:40 AM IST
ఎమ్మెల్యే అయితే చాలు.. హైదరాబాద్ లో క్వార్టర్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేసే సీన్ మారిపోయింది. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఎమ్మెల్యేలు.. వారికి కేటాయించిన క్వార్టర్లను వినియోగించుకోవటానికి ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవటం విశేషం. దాదాపు 200 క్వార్టర్లు ఏపీ ఎమ్మెల్యేల కోసం హైదరాబాద్ లో కేటాయిస్తే.. కేవలం 50 నుంచి 60 క్వార్టర్లు మాత్రమే ఎమ్మెల్యేలు తీసుకోవటం గమనార్హం.

క్వార్టర్ల విషయంలో గతంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేకపోవటానికి కారణాలు చూస్తే.. ఆసక్తికరమైన అంశాలు చాలానే కనిపిస్తాయి. విభజనలో భాగంగా ఏపీ ఎమ్మెల్యేల కోసం కేటాయించిన క్వార్టర్లు పాతవి కావటం.. తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్తవి కేటాయించటంతో.. వాటిని తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించని పరిస్థితి. దీనికి తోడు.. హైదరాబాద్ లో కార్యకలాపాలు తగ్గిపోవటంతో క్వార్టర్లు తీసుకునేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు.

దీనికి బదులుగా.. హెచ్ ఆర్ అలవెన్స్ కింద ఎమ్మెల్యేలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.25వేలు తీసుకుంటున్న నేతలు.. ఆ సొమ్ముతో.. ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర రాజధానిగా ఉన్న విజయవాడ ప్రయాణానికి అనువుగా ఉండేందుకు రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న మణికొండ.. కూకట్ పల్లి.. బంజారాహిల్స్ లో ఫ్లాట్లు తీసుకోవటానికి మక్కువ ప్రదర్శిస్తున్నారు.

వసతులు పెద్దగా లేని పాత క్వార్టర్లు తీసుకునే కన్నా.. అందుకు బదులుగా రూ.25వేల చొప్పున నెలకు హెచ్ ఆర్ మొత్తాన్ని తీసుకొని.. దాంతో మంచి మంచి ఫ్లాట్లు తీసుకునే ధోరణి ఈ మధ్య బాగా పెరిగింది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీ ఎమ్మెల్యేల బస వ్యవహారంలో చాలానే మార్పు వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.