Begin typing your search above and press return to search.

ఒక్కో ఆంధ్రుడి మీదా అంతేసి అప్పు ఉంద‌ట‌

By:  Tupaki Desk   |   9 May 2018 7:38 AM GMT
ఒక్కో ఆంధ్రుడి మీదా అంతేసి అప్పు ఉంద‌ట‌
X
మాట‌లు ఎవ‌రైనా చెబుతారు. చేత‌ల్లో చేసి చూపించ‌ట‌మే మొన‌గాడిత‌నం. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోరు విప్పితే చాలు.. గొప్ప‌ల మాట‌లు కోట‌లు దాటుతుంటాయి. విభ‌జ‌న అనంత‌రం రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయిన ఆయ‌న‌.. అది చేస్తాం.. ఇది చేస్తామ‌ని చెప్పిన మాట‌లు చాలానే ఉన్నాయి. నాలుగేళ్ల ప‌ద‌వీ కాలంలో ఆయ‌నేం చేశారో ఏపీలోని ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే.

ఏం చేసినా.. చేయ‌కున్నా ఆంధ్రోడి నెత్తి మీద ఉంటే త‌ల‌సరి అప్పును మాత్రం బాగానే పెంచేశార‌ని చెప్పాలి. ఏపీలోని అప్పుడే పుట్టిన బిడ్డ త‌ల మీద ఉన్న అప్పు లెక్క‌లు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నేప‌థ్యంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై నివేదిక‌ను విడుద‌ల చేశారు.

దీని ప్ర‌కారం ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ల‌స‌రి అప్పు రూ.42,324కు పెరిగిన‌ట్లుగా తేలింది. గ‌త ఏడాదితో పోలిస్తే.. ఈ అప్పు భారం దాదాపు 10 శాతానికి మించి పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌త ఏడాది (2017-18)తో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా రూ.4292 మేర పెరగ‌టం గ‌మ‌నార్హం. జాతీయ త‌ల‌స‌రి ఆదాయంతో పోలిస్తే.. ఆంధ్రోళ్ల త‌ల‌స‌రి ఆదాయం ఎక్కువే అయినా.. అప్పు భారం సైతం భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి గ‌డిచిన నాలుగేళ్ల‌లో అప్పు భారం అంత‌కంత‌కూ భారీగా పెరుగుతోంది. విభ‌జ‌న నాటి అప్పు భారం ఎంతో.. గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో దాదాపు అంతే మొత్తాన్ని అప్పుగా రాష్ట్ర స‌ర్కారు తీసుకొచ్చింద‌ని చెప్పాలి. పెరుగుతున్న అప్పు సంగ‌తిని ప‌క్కన పెడితే.. గ‌త ఏడాదితో పోల్చిన‌ప్పుడు ఏపీ ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం కూడా పెరుగుతున్న వైనం సానుకూలాంశంగా చెప్పాలి.

ఆదాయ‌ప‌రంగా చూస్తే ఏపీలో కృష్ణా జిల్లా తొలిస్థానంలో నిలిస్తే.. విశాఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలు రెండు.. మూడు స్థానాల్లో నిలిచాయి. కృష్ణా జిల్లా రూ.1,89,121 త‌ల‌స‌రి ఆదాయంతో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇది జాతీయ త‌ల‌స‌రి ఆదాయం కంటే ఎక్కువ‌. ఇదిలా ఉంటే.. కృష్ణా జిల్లా త‌ల‌స‌రి ఆదాయంతో పోలిస్తే.. శ్రీ‌కాకుళం స‌గంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆదాయం విష‌యంలో అంత‌రం ఏపీలో ఎంత ఎక్కువ‌న్న విష‌యం తాజా ఉదాహ‌ర‌ణ మ‌రోసారి స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. జిల్లాల మ‌ధ్య ఆర్థిక అంత‌రాలు అంత‌కంతకూ ఎక్కువ కావ‌టం ఏ మాత్రం మంచిది కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఏపీ వ్యాప్తంగా త‌ల‌స‌రి ఆదాయంలో ఎక్కువ వ్య‌త్యాసం లేకుండా చూడాల్సిన అవ‌స‌రం బాబు మీద ఉంది. లేనిప‌క్షంలో ఏపీకి ఈ తీరు ఏ మాత్రం మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.