Begin typing your search above and press return to search.

8.25 గంట‌ల్లో పాక్ జ‌ల‌సంధిని ఈదిస తెలుగోడు

By:  Tupaki Desk   |   26 March 2018 5:38 AM GMT
8.25 గంట‌ల్లో పాక్ జ‌ల‌సంధిని ఈదిస తెలుగోడు
X
తెలుగోడి గొప్ప‌త‌నం మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన‌ట్లు అయ్యింది. ఏమిటా గొప్ప‌త‌నం? అన్న విష‌యం తెలుసుకునే ముందు ఒక ఉదాహ‌ర‌ణ తెలిస్తే..మ‌నోడు ఎంత మొన‌గాడో తెలుస్తుంది. ఎవ‌రైనా గంట‌కు ఎన్ని కిలో మీట‌ర్లు న‌డుస్తారంటే.. నాన్ స్టాప్ గా ఒకింత వేగంగా న‌డిస్తే 5 కిలోమీట‌ర్లు న‌డిచే వీలు ఉంటుంది. మ‌రీ వేగంగా న‌డిస్తే ఆరు కిలోమీట‌ర్లకు మించి న‌డ‌వ‌లేరు.

నేల మీద గంట‌కు ఐదారు కిలోమీట‌ర్లకు మించి న‌డ‌వ‌లేని ప‌రిస్థితి ఉంటే.. పాక్ జ‌ల‌సంధిలో గంట‌కు ఎన్ని కిలో మీట‌ర్లు ఈద‌గ‌లుగుతారు? అన్న క్వ‌శ్చ‌న్ వేస్తే.. రెండు కిలోమీట‌ర్లు ఈద‌గ‌లుగుతారు. అలాంటిది ఒక తెలుగు పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఏకంగా నాలుగు కిలోమీట‌ర్ల‌పైనే ఈది రికార్డు సృష్టించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అంతేనా.. నాన్ స్టాఫ్ గా ఎనిమిదిన్న‌ర గంట‌ల పాటు ఈదిన తీరు.. తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటినట్లైంది. మ‌నోడి రికార్డు విష‌యానికి వ‌స్తే.. ఏపీకి చెందిన 29 ఏళ్ల మోదుకూరి తుల‌సి చైత‌న్య హెడ్ కానిస్టేబుల్ గా ప‌ని చేస్తున్నాడు. తాజాగా ఒక అరుదైన ఫీట్ చేశాడు.భార‌త్‌.. శ్రీ‌లంక‌ను వేరు చేసే పాక్ జ‌ల‌సంధిని కేవ‌లం 8.25 గంట‌ల్లో ఈది అత్యంత వేగంగా ఈదిన స్విమ్మ‌ర్ గా నిలిచారు.

ఆదివారం ఉద‌యం శ్రీ‌లంక‌లోని త‌లైమ‌న్నార్ హార్బ‌ర్ వ‌ద్ద మొద‌లెట్టిన ఈత‌.. 32 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 8.25 గంట‌ల వ్య‌వ‌ధిలో ఈది ఉద‌యం 9.25 గంట‌ల‌కు త‌మిళ‌నాడులోని ధనుష్కోటి వ‌ద్ద‌కు చేరుకున్నాడు. దీంతో.. గ‌త శ‌నివారం చెన్నై కాలేజీ కుర్రాడు రాజేశ్వ‌ర‌ప్ర‌భుత్ నెల‌కొల్పిన జాతీయ రికార్డును తెలుగోడు బ్రేక్ చేసిన‌ట్లైంది.

స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగాన్ని సాధించిన చైత‌న్య త‌న కాలేజీ రోజుల్లోనే ప‌లు ప‌త‌కాల్ని సొంతం చేసుకున్నాడు. పోలీసు ఉద్యోగంలో చేరిన త‌ర్వాత కూడా స్విమ్మింగ్ మీద త‌న‌కున్న ఆస‌క్తిని వ‌దులుకోలేదు.

ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది స్ఫూర్తితో తానీ సాహ‌సం చేసిన‌ట్లు చెప్పాడు. త‌న తాజా రికార్డులో పోలీసు శాఖ స‌హ‌కారం మ‌ర్చిపోలేన‌ని.. డీజీపీ.. క‌మిష‌న‌ర్ ప్రోత్సాహంతోనే తానీ సాహ‌సం చేసిన‌ట్లు చెప్పాడు. 8.25 గంట‌ల్లో 32 కిలోమీట‌ర్లు ఈద‌టం అసాధ్య‌మే కానీ.. రామ‌సేతు సాక్షిగా తానీ రికార్డును సాధించిన‌ట్లుగా చెప్పాడు. దీని కోసం ఆరు నెల‌లుగా ప్ర‌త్యేకంగా సాధ‌న చేసిన‌ట్లు చెప్పాడు.

ఈ ఫీట్ కోసం నేవీ.. క‌స్ట‌మ్స్‌.. సీఐడీ.. లోక‌ల్ ఆథారిటీస్.. లంక హైక‌మిష‌న్ ఇలా ఎన్నో క్లియ‌రెన్స్ లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. ఈ ఫీట్ లో భాగంగా సాయంగా నిలిచే బోటు నుంచి వేసే ఫ్ల‌డ్ లైట్‌.. ఫ్లాష్ లైట్ వెలుతురు త‌ప్పించి ఇంకేమీ క‌నిపించ‌లేద‌ని.. మ‌ధ్య‌లో షార్క్ ని చూసిన‌ట్లు చెప్పారు. ఒక తెలుగు పోలీసు చేసిన సాహ‌సం.. మిగిలిన వారంద‌రికి స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహం లేదు.