Begin typing your search above and press return to search.

జగన్ 'లోకల్' డెసిషన్... ప్లస్సా? మైనస్సా?

By:  Tupaki Desk   |   25 July 2019 4:17 AM GMT
జగన్ లోకల్ డెసిషన్... ప్లస్సా? మైనస్సా?
X
వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయాలు తీసుకుంటూ చాలా దూకుడుగానే సాగుతున్నారని చెప్పక తప్పదు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిపోయిన జగన్... చాలా విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి నిర్ణయాలన్నింటిలోకి బుధవారం అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన ‘లోకల్’ బిల్లే. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే సంస్థలతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న పరిశ్రమలు కూడా తమ పరిధిలోని ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు ఇచ్చి తీరాలన్నదే ఆ చట్టం లక్ష్యం. పాదయాత్ర సందర్భంగానే దీనిపై చాలా స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్ తాను అధికారంలోకి రాగానే... దానిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అసెంబ్లీలో సదరు బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో అది చట్టంగా మారిపోయింది.

అంటే... ఇప్పటికే రాష్ట్రంలో ప్లాంట్లు కలిగి ఉన్న సంస్థలతో పాటు కొత్తగా పరిశ్రమలు పెట్టే యాజమాన్యాలు కూడా ఆయా ప్లాంట్లకు చెందిన ఉద్యోగాల్లో 75 శాతాన్ని స్థానికులకే ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ఎంతమాత్రం వెనకడుగు వేసేది లేదని - తాము తీసుకున్న నిర్ణయాన్ని అన్ని సంస్థలు అమలు చేయాల్సిందేనని కూడా జగన్ చాలా క్లారిటీగానే చెప్పారు. మరి ఈ నిర్ణయం ఏపీకి లాభదాయకంగా మారుతుందా? లేదంటే విపక్షం ఆరోపిస్తున్నట్లుగా నష్టం కలిగిస్తుందా? అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారు ఈ నిర్ణయం రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలుతుందని వాదిస్తుంటే... జగన్ నిర్ణయాన్ని నిరసిస్తున్న వారేమో ఉద్యోగాలన్నీ స్థానికులు ఇచ్చేందుకు ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాదని, ఫలితంగా రాష్ట్రం పారిశ్రామికంగా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని చెబుతున్నారు. మరి వాస్తవాలేమిటన్న విషయానికి వస్తే... జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లాభాలు - నష్టాలేమిటన్న విషయాలను కాస్తంత కూలంకషంగానే పరిశీలించాల్సి ఉంది.

లాభాలు

1. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గిపోతుంది
2. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
3. వసల వెళ్లే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు
4. స్థానికులకే ఉద్యోగాలంటూ ఇస్తే.. పరిశ్రమలకు ఆయా పంచాయతీల నుంచి అనమతులు ఈజీగానే లభిస్తాయి
5. స్థానికులకు కొలువుల ద్వారా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ది చెందే అవకాశాలుంటాయి.
6. లోకల్ కు ఉద్యోగాలతో స్థానికంగా తలెత్తే సమస్యల పరిష్కారం చాలా సులువనే చెప్పాలి.

నష్టాలు

1. ఉద్యోగాల్లో మెజారిటీ వాటా స్థానికులకే అంటే కొన్ని పరిశ్రమలు వెనకడుగు వేసే అవకాశం ఉంది.
2. లోకల్ ఉద్యోగులు ఎక్కువ అయితే... కంపెనీ నిర్వహణలో యాజమాన్యాలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపో్లేదు.
3. కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యాజమాన్యాలు... ఉద్యోగాలను తమ వారికి కాకుండా వేరే వారికి ఇవ్వాలంటే వెనుకాడవచ్చు
4. స్థానిక యువతలో నైపుణ్యం లేకుంటే ఏం చేయాలన్నది అసలు సిసలు ప్రశ్నగా మారుతుంది.
5. లోకల్ ఉద్యోగులతో కంపెనీలపై స్థానిక రాజకీయ నేతల పెత్తనం కూడా పెరుగుతుంది.
6. మెజారిటీ ఉద్యోగులు లోకల్ అయితే... యాజమాన్యాలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం కొంతమేర ఇబ్బందికరమే.