Begin typing your search above and press return to search.

ఏపీలో మరోసారి లాక్ డౌన్ .. కరోనా కట్టడికి కఠిన నిర్ణయం తప్పదా ?

By:  Tupaki Desk   |   22 July 2021 8:36 AM GMT
ఏపీలో మరోసారి లాక్ డౌన్ .. కరోనా కట్టడికి కఠిన నిర్ణయం తప్పదా ?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మరోసారి అందరిని ఆందోళనకి గురి చేస్తుందా ! థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని ఏపీ కరోనా అధికారులు ముందే ఊహించారా, తొలి రెండు దశల్లో జరిగిన తప్పిదాలను మూడో దశలో రిపీట్ చేయకూడదని దృఢంగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కరోనా విషయంలో ఏ చిన్న అనుమానాన్ని కూడా లైట్ తీసుకోడానికి సిద్ధంగా లేరు.

అందుకే కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను పొడిగించారు, సడలింపుల్లో మళ్లీ కుదింపు చేస్తున్నారు. క‌రోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరును చూస్తే అంత‌కంత‌కూ పెరుగుతున్నాయే తప్ప.. అదుపులోకి రావ‌డం లేద‌న్న అభిప్రాయం ప్రభుత్వ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదు అవుతోన్న కరోనా కేసుల విషయంలో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానం లో ఉంది. గడచిన 20 రోజుల్లో అక్కడ దాదాపు 11వేల కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకి సగటున 500కంటే కేసులు తగ్గేలా కనిపించడంలేదు. మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ.

దీనితోనే ఆ జిల్లా అధికార యంత్రాంగం ముందు చూపుతో జిల్లా వ్యాప్తంగా కరోనా నియమాలని అమలు చేస్తుంది. జిల్లా మొత్తాన్ని ఒకే చోటకి చేరకుండా ఎక్కడికక్కడ స్థానికంగా కంటైన్మెంట్ జోన్లను నిర్థారించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో కర్ఫ్యూ ఆంక్షలు పొడిగించారు.

ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అక్కడ కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఎవరూ ఇళ్లలోనుంచి బయటకు రావడానికి వీల్లేదు, వ్యాపార కార్యకలాపాలు జరగడానికి వీలు లేదు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. తాజాగా గొల్లప్రోలు మండలం చెబ్రోలు గ్రామంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు లాక్ డౌన్ విధించారు. వారంరోజుల పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తహసీల్దార్ అమ్మాజీ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఇకపోతే , నెల్లూరు జిల్లాలోని కావలి డివిజన్ లో కూడా కేసులు రోజు రోజుకీ కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, స్థానిక వ్యాపారులతో చర్చించారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచేలా ఆంక్షలు విధించాలని సూచించారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా దీనికి ఒప్పుకున్నారు. జిల్లాలోని పెద్ద చెరుకూరు, చిన్న చెరుకూరు గ్రామాల్లో ఒకేరోజు 100మందికి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

దీంతో జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తున్న అధికారులు ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ తీసేసినా, ఏపీలో మాత్రం రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు కర్ఫ్యూ ఉంటుందని ఇటీవలే సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడు మొదలైనా ఎదుర్కోడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని సీఎం జగన్ ఈ మద్యే కీలక ప్రకటన చేసింది. ఏపీలో వ్యాక్సినేషన్ కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఒకవేళ, థర్డ్ వేవ్ లో చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురి అయితే, దానికి అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆస్పత్రులు, ప్రత్యేక వార్డుల నిర్మాణం కూడా ఊపందుకుంది.