Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌పై ఇంత నిఘా ఎందుకు బాబూ?

By:  Tupaki Desk   |   30 Oct 2017 9:47 AM GMT
ఉద్యోగుల‌పై ఇంత నిఘా ఎందుకు బాబూ?
X
ఎక్క‌డ చూసినా కెమెరాలు! నిల‌బ‌డినా.. నిద్ర‌పోయినా.. ప‌నిచేసినా.. ఖాళీగా తిరుగుతున్నా.. ప‌క్క వాడితో మాట్లాడు తున్నా ప్రతి నిమిషం.. కాదుకాదు ప్ర‌తి సెక‌న్ రికార్డు అవ్వాల్సిందే! లోప‌లే ఇలా ఉంది క‌దా అని బ‌య‌టికొచ్చి కాసేపు చ‌ల్ల‌గాలి పీల్చుకుందామ‌న్నా అక్కడైనా వ‌దిలితే క‌దా!! బాత్ రూమ్ మిన‌హా.. కారిడార్డు - క్యాబిన్లు - క్యాంటీన్లు.. చివ‌రికి కంప్యూట‌ర్లలోనూ సీసీ కెమెరాలే!! ఏంటి ఇదంతా బిగ్‌ బాస్ షోలోని ఇంటి గురించి అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసి నట్టే! ఇప్పుడు చెప్పిందంతా ఏపీ స‌చివాల‌యం గురించే అంటే న‌మ్మ‌గ‌ల‌రా! టెక్నాల‌జీని రాష్ట్రానికి ప‌రిచ‌యం చేసిందే నేను అనే రేంజ్‌ లో మాట్లాడే సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు టెక్నాల‌జీతో స్వేచ్ఛ‌ను హ‌రించేస్తున్నారు!

ప్ర‌తి విష‌యంలోనూ సాంకేతిక‌త వినియోగించుకుని ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు అదే సాంకేతిక‌త‌తో స‌చివాల‌య ఉద్యోగుల‌పై నిఘా పెంచేశారు. అది కూడా ఎంత‌లా అంటే.. ఎటు క‌ద‌లినా కెమెరాల్లో రికార్డ‌యిపోవాల్సిందే! వారి న‌మ్మ‌కం లేక‌నో లేక మ‌రేదైనా ఉద్దేశ‌మో తెలియ‌దు గాని.. ఇలా సచివాల‌యం అంతా మూడో క‌న్ను క‌నుస‌న్న‌ల్లో ఉండాల్సిందే!! సచివాలయంలో సీసీ కెమెరాలు ఉండాలి కానీ.. మరీ ఇన్ని అవసరమా? అని ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ అధికారులు - ఉద్యోగులపై ప్రభుత్వం నిఘా పెంచిందని వివ‌రిస్తున్నారు.

కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటుచేశార‌ట‌. దీంతో సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్‌ ఉద్యోగి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది సచివాలయమా? లేక `బిగ్‌ బాస్‌ హౌసా`అని ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అక్కడ 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని వాపోతున్నారు.

ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇప్పటికే బయోమెట్రిక్‌ హాజరు పేరుతో ఉద్యోగుల పనితీరు పట్టించుకోకుండా.. హాజరు మాత్రమే చూస్తున్నారని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఇప్పుడు ఈ-ఆఫీస్‌ వల్ల సెలవు రోజుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అలాంటి తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం తమను అవమానించడేమనని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం సరికాదని అన్నారు. పారదర్శక పాలన కోసమే ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సర్కారు పెద్దలు చెబుతుండటం గమనార్హం.