Begin typing your search above and press return to search.

60 ఏళ్ల ఆంధ్రా బంధం నిన్నటితో తెగిపోయింది

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:19 AM GMT
60 ఏళ్ల ఆంధ్రా బంధం నిన్నటితో తెగిపోయింది
X
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 ఏళ్లు. తెలుగు ప్రజలంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలన్న ఆలోచనతో ముడిపడిన బంధం.. రెండున్నరేళ్ల క్రితం జరిగిన విభజనతో తెగిపోగా.. నిన్నటి (శుక్రవారం)తో పూర్తిగా ముగిసినట్లైంది. విభజన జరిగినప్పటికీ.. ఏపీ సచివాలయంతో సహా పలు సంస్థలు హైదరాబాద్ లోనే ఉండటం.. విభజన చట్టం ప్రకారం పదేళ్లు హైదరాబాద్ నుంచి పాలించే అవకాశం ఉన్నప్పటికీ.. ఏపీ నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ కావటంతో దాదాపు ఏడున్నరేళ్లు ఉండే అవకాశం ఉన్నా వెళ్లిపోయారని చెప్పాలి.

తొలుత హైదరాబాద్ కేంద్రంగానే ఏపీ పాలన సాగించాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతారు. దీనికి తగ్గట్లే ఆయనమాటలు ఉండేవి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలినాళ్లలో.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. తాను హైదరాబాద్ వదిలేసి ఏపీకి వెళతానని చంద్రబాబు చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఓటేసిన ఏపీ ప్రజల్ని పట్టించుకోకుండా.. అధికారం లేని తెలంగాణ మీద బాబు మోజుపై పలువురు విమర్శలు చేశారు. అయినా.. వాటిని పట్టించుకోని చంద్రబాబు.. హైదరాబాద్ మీద తనకు అభిమానాన్ని ప్రదర్శించే ప్రయత్నాన్ని మానుకోలేదు.

అదెంత వరకూ అంటే.. పేరుకు ఏపీ ముఖ్యమంత్రే కానీ.. ఆయన ఓటుహక్కు తెలంగాణ రాష్ట్రంలో ఉండటంపై విపక్షం ఆయనపై విమర్శలకు దిగింది. అదే సమయంలో ఓటుకు నోట వ్యవహారం తెరపైకి రావటం.. ఆ వెంటనే.. చంద్రబాబు ఏపీకి వెళ్లిపోయేందుకు నిర్ణయంతీసుకోవటంతో పాటు.. పాలనా యంత్రాంగాన్ని సైతం ఏపీకి తరలించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి మొదలైన కసరత్తు నిన్నటి ( శుక్రవారం)తో ముగిసింది.

నవ్యాంధ్రకు చెందిన అధికారులు హైదరాబాద్ లో పని చేయటానికి ఆఖరి పని దినం శుక్రవారం (సెప్టెంబర్ 30) కావటం.. నిజాంల నుంచి వారసత్వంగా వచ్చిన సచివాలయ ప్రాంగణంలో సాగిన అరవైఏళ్ల సుదీర్ఘ ప్రయాణం నిన్నటితో ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయంతో 28నెలల పాటు సాగిన పాలనకు బ్రేక్ పడిపోయింది.

విభజనలో భాగంగా హెచ్.. జే.. కే .. ఎల్ బ్లాక్ లు ఏపీకి కేటాయించారు. అందులోనే ముఖ్యమంత్రి.. మంత్రి కొలువు తీరారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వారు ఏపీకి వెళ్లిపోయారు. తాజాగా మొత్తం సిబ్బంది వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి వెళ్లిపోయారు. అయితే.. ఏపీకి సంబంధించిన భవనాల్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయలేదు. రికార్డుల నిర్వహణ.. కోర్టు కేసులు.. తదితర వ్యవహారాలు చూసుకునేందుకు నామమాత్రం సిబ్బంది మాత్రం హైదరాబాద్ లోనే ఉండి కార్యకలాపాల్ని చూసుకుంటారు. ఒక్కో శాఖకు చెందిన ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే హైదరాబాద్ లో ఉండనున్నారు. వీరు.. మినహా మిగిలిన వారంతా వెలగపూడికి వెళ్లిపోయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/