Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయ ఉద్యోగులు అంత ఫీల్ కావాలా?

By:  Tupaki Desk   |   5 Jun 2016 9:27 AM GMT
ఏపీ సచివాలయ ఉద్యోగులు అంత ఫీల్ కావాలా?
X
ఉద్యోగం అంటేనే ఒకడి కింద పని చేయటం. యజమాని ప్రైవేటు.. అయితే ప్రభుత్వం అయితే సంస్థ ప్రయోజనాలే ముఖ్యం తప్పించి ఉద్యోగుల ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఉద్యోగులంతా బాగుండాలి.. సంస్థ మాత్రం నాశనం కావాలనుకుంటే ముందు మునిగేది సంస్థే అయినా.. ఆ తర్వాత మునిగిపోయేది ఉద్యోగులు కూడా అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీ విభజన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయాన్ని అమరావతికి మార్చాలన్నది ఏపీ ముఖ్యమంత్రి ఆలోచన.

ఇదేమీ రాత్రికి రాత్రి పుట్టిందేమీ కాదు. నిజానికి ఈ వ్యవహారం ఇప్పటికి డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది కానీ.. నిజానికి విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతోనే ఏపీలోని సచివాలయ ఉద్యోగులు ఏపీకి వెళ్లిపోవాల్సి ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయింది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి దాదాపు మూడేళ్లకు పైనే సమయం పట్టిందని చెప్పాలి.

రంగం ఏదైనా కానీ.. ఒక ఉద్యోగి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లటానికి మానసికంగా సిద్ధం కావటానికి ఇంతకంటే ఎక్కువ టైం ఎవరు మాత్రం ఇవ్వగలరు. నిజానికి ఏపీ ప్రజలు ఈ రోజు ఇన్ని తిప్పలు పడటానికి ఏపీ సచివాలయ ఉద్యోగులు కూడా కారణమన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్లో నీళ్లు.. నిధులు.. నియమకాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. నియమకాల విషయంలో స్వార్థంతో వ్యవహరించి ఉండకపోతే తెలంగాణ ఉద్యమం ఇప్పుడీ రూపులో ఉండేది కాదు.

గుప్పెడు మంది స్వార్థం కోసం కోట్లాది మంది ప్రయోజనాల్ని దెబ్బ తీసింది చాలక.. మూడేళ్లు గడిచిన తర్వాత కూడా అమరావతికి తరలి వెళ్లేందుకు వసతి సౌకర్యం లేదని.. ఇంకా ఇలాంటి సౌకర్యాల మాటను చూపిస్తూ మరికొన్ని రోజులు హైదరాబాద్ లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలన్న వైనం చూసినప్పుడు సగటు సీమాంధ్రుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యమంత్రే తన మానాన తాను వచ్చి బెజవాడలో కూర్చొని పని చేస్తుంటే ఉద్యోగులు మాత్రం అందుకు భిన్నంగా సాకులు చూపిస్తూ.. మరికొంత కాలం హైదరాబాద్ లోనే కొనసాగాలన్న ఆలోచన చేయటం దుర్మార్గమనే చెప్పాలి. ఉద్యోగం కంటే హైదరాబాదే సుఖంగా ఉంటే.. చక్కగా ఉద్యోగానికి రాజీనామా చేస్తే సరిపోతుంది కదా? ప్రభుత్వ ఉద్యోగిగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ.. అదే ఏ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంటే.. కంపెనీని మూసేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామంటే అన్ని మూసుకొని మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోరా? వారెవరికి ఎదురుకాని ఇబ్బందులు అన్ని ఏపీ సచివాలయ ఉద్యోగులకే ఎందుకు వస్తున్నట్లు? ఏపీకి తరలి రావటానికి కిందామీదా పడుతున్న వారిని ఏపీ సర్కారు ముద్దు చేయటం మాని కఠినంగా వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయం సీమాంధ్రులో బలంగా వినిపిస్తోంది.