Begin typing your search above and press return to search.

తరలింపు తుస్సు.. బాబు డెడ్ లైన్లు డమాబుస్సు

By:  Tupaki Desk   |   21 Jun 2016 7:27 AM GMT
తరలింపు తుస్సు.. బాబు డెడ్ లైన్లు డమాబుస్సు
X
చంద్రబాబు హామీల మాదిరిగానే ఆదేశాలూ అభాసుపాలవుతున్నాయి. దీంతో ఆయన సంకల్పాల సంగతీ అలాగే ఉండబోతుందన్న సెటైర్లు పడుతున్నాయి. ఎన్నికల హామీల అమల్లో విఫలమైన చంద్రబాబుపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరావాలని చంద్రబాబు ఒత్తిడి చేస్తుండడంతో ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ తరుణంలో ఈ నెల 27లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ తాత్కాలిక సచివాలయానికి రావాల్సిందేనని చంద్రబాబు తన నిర్ణయాన్ని చెప్పడంతో ఉద్యోగులు చాలావరకు అందుకు సిద్ధమయ్యారు. తీరా ఆ తేదీ దగ్గరపడుతున్న సమయానికి తాత్కాలిక సచివాలయం మాత్రం సిద్ధం కాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం - వివిధ శాఖాధిపతుల కార్యాలయాలను అమరావతికి తరలించడం ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. ఈనెల 27న సచివాలయం తరలిపోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు నెలల క్రితం చేసిన ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నట్లయింది. సచివాలయ తరలింపునకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు హడావుడి పడుతున్నా కూడా పనులు మాత్రం పూర్తయ్యే సూచనలు లేవు.

ఒక్కో శాఖాధిపతి కార్యాలయానికి ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు కావాలో, వాటికి అవసరమైన వసతులు ఏ మేరకు ఏర్పాటు చేయాలన్న అంశంపై సీఎస్ టక్కర్ ఇప్పటికే సమీక్షించారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని టక్కర్‌ సేకరించారు. సచివాలయ తరలింపు ఇన్‌ చార్జ్‌ పాణిగ్రహి అనారోగ్యానికి గురికా వడంతో ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే... సచివాలయ నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే పూర్తికావని సీఆర్‌ డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ మిగతా అధికారులతో చెబుతున్నారు. దీంతో 27 నాటికి తరలింపు చంద్రబాబు చేస్తున్న హడావుడి తప్ప ఇంకేమీ కాదని తేలిపోయింది.

వాస్తవ పరిస్థితులు చూస్తే 27లోగా ఒక బ్లాకు కూడా అప్పగించేందుకు కాంట్రాక్టు కంపెనీలు సిద్ధంగా లేవు. అంతేకాదు.. పలు చోట్ల లీజుకు తీసుకున్న కార్యాలయాల భవనాల్లోనూ శాఖల అవసరాలకు తగిన మార్పులు పూర్తికాలేదుట. వీటన్నిటికీ కనీసం మరో రెండు నెలలు సమయం అవసరం అవుతుందని అధికారులు అంటున్నారు. దీంతో విజయవాడ - గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పట్లో శాఖల కార్యాలయాలు తరలించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అలాగే సచివాలయ భవన నిర్మాణాల పనులు వర్షాలతో ఆలస్యమవుతున్నం దున ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో సచివాలయానికి ఉద్యోగులు తరలివెళ్లేందుకు కనీసం మరో మూడు నెలలు పడుతుందని అధికారులే అంటున్నారు. ఆగస్టు నుంచి దశలవారీగా సిబ్బందిని పంపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే... జూన్‌ ఆరంభం నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పనుల వేగం పెంచేందుకు చేసే ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ కారణంగా ఆగస్టు నాటికైనా పనులు పూర్తవుతాయన్న నమ్మకంలేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే.. తరలింపు అంశాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఈ ఉద్యోగులతో 27న సచివాలయంలో అధికారికంగా చేర్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ రోజున సంప్రదాయ బద్ధంగా గృహ ప్రవేశం తరహాలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలిక సచివాలయంలోకి ఉద్యోగులతో కార్యాలయ ప్రవేశం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలిక సచివాలయం నుంచి పాలన కూడా అమరావతి నిర్మాణ శంకు స్థాపనలాగే గృహ ప్రవేశ కార్యక్రమానికే పరిమితమవుతుందని అంటున్నారు.