Begin typing your search above and press return to search.

ఫైళ్లు.. ఫర్నీచర్ మొత్తంగా వెళ్లిపోయాయి

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:08 AM GMT
ఫైళ్లు.. ఫర్నీచర్ మొత్తంగా వెళ్లిపోయాయి
X
హైదరాబాద్ లోని ఏపీ సచివాలయం మొత్తంగా ఖాళీ అయినట్లే. మొన్నటికి మొన్న ఉద్యోగులు ఏపీలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. గత శుక్రవారం హైదరాబాద్ లో చివరి వర్కింగ్ డే కావటం.. అనంతరం వెలగపూడికి వెళ్లిపోయిన వారంతా తమ విధుల్ని అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే.. వారికి సంబంధించిన ఫైళ్లు.. కంప్యూటర్లు.. లాంటివి వెలగపూడికి చేరుకోకపోవటంతో.. మూడు రోజులుగా ఎలాంటి పని చేయలేని పరిస్థితి.

దీంతో.. సచివాలయ అధికారులు వెలగపూడికి వచ్చేసినా.. వారు పని చేసేందుకు వీల్లేని వాతావరణం నెలకొంది. అయితే.. అలాంటి పరిస్థితిని మూడు రోజుల్లోనే సెట్ చేశారు. బుధవారం నాటికి పరిస్థితి మొత్తం యథాతధ స్థితికి వచ్చేసింది. హైదరాబాద్ సచివాలయం నుంచి ఫైళ్లు.. ఫర్నీచర్.. కంప్యూటర్లు మొత్తం వెలగపూడికి చేరిపోవటం.. వాటిని సర్దేయటంతో బుధవారం నుంచి ఉద్యోగులు పనులు మొదలు పెట్టారు.

మొన్నటివరకూ ఉద్యోగులతో కళకళలాడిన హైదరాబాద్ లోని ఏపీ సచివాలయం ఇప్పుడు పూర్తిగా బోసి పోయింది. పరిమిత సంఖ్యలో ఉద్యోగులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అందరూ వెళ్లి పోయినప్పటికీ కార్మికశాఖ.. హోం.. విద్యా శాఖలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇవి కూడా ఈ నెల 16 నాటికి తరలి వెళ్లనున్నాయి. ఆ తర్వాత ఏపీ సచివాలయం మొత్తం నిర్మానుష్యంగా మారిపోనుంది. మరోవైపు.. నిన్న మొన్నటి వరకూ ఒక మోస్తరు ఉద్యోగులతో ఉన్న వెలగపూడి సచివాలయం ఇప్పుడు కళకళలాడిపోతోంది. అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఏపీ సర్కారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.

గ్రీన్ అమరావతి నినాదానికి తగ్గట్లుగా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను ఏపీ సర్కారు తీసుకుంది. సచివాలయ ఉద్యోగుల రవాణా కోసం ఆధునాతన బ్యాటరీ ఆటోల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయంలోపని చేసే దివ్యాంగ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రెండు అధునాతన బ్యాటరీ ఆటోల్ని ఏర్పాటుచేశారు. వీటి సాయంతో దివ్యాంగుల ఇళ్ల నుంచి కానీ.. బస్టాండ్ల నుంచి కానీ వారిని వెలగపూడి సచివాలయానికి చేర్చేలా ఏర్పాట్లు చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/