Begin typing your search above and press return to search.

డిఫెన్స్‌ లో ఏపీ టీడీపీ..రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   3 May 2016 7:27 AM GMT
డిఫెన్స్‌ లో ఏపీ టీడీపీ..రీజ‌న్ ఇదే
X
మొన్న‌టివ‌ర‌కూ ఏపీ రాజ‌కీయాలు ప్ర‌భుత్వానికి అనుకూలంగా న‌డిచాయి. ఏది ప‌ట్టుకున్నా బంగారంలా మారిపోయే ప‌రిస్థితి. ముఖ్యంగా రాజ‌కీయంగా బ‌లోపేతం అవ్వాల‌ని ప్రారంభించిన `ఆక‌ర్ష్‌` స‌త్ఫ‌లితాల‌నే ఇచ్చింది. కానీ ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియ‌ని పరిస్థితి. అందుకే ఇప్పుడు టీడీపీ నాయ‌కులు ఫుల్లుగా డిఫెన్స్‌ లో ప‌డిపోయారు. ఎందుకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది? ఇంతలా పార్టీ డిఫెన్స్‌ లో ప‌డిపోవ‌డానికి కార‌ణాలేంటి? అంటే రెండే రెండు రీజ‌న్స్ వ‌ల్లే ఏపీ టీడీపీ డిఫెన్స్‌ లో ప‌డిపోయింద‌ట‌.

ఒక‌వైపు ప్ర‌త్యేక‌హోదా అంశం రాష్ట్రాన్ని తీవ్రంగా అత‌లాకుతలం చేస్తోంది. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని బీజేపీ ఎంతలా మొత్తుకున్నా.. వాటిని మాత్రం బీజేపీ ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతా రాష్ట్ర ప్రభుత్వ చేతగాని తనమే అని అందరూ నిందిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేత ప్ర‌క‌టించిన నిరశ‌న దీక్ష‌. తెలంగాణ‌లో ప్రాజెక్టుల వ‌ల్ల రాయ‌ల‌సీమ ప్రాంతం దెబ్బ‌తింటుంద‌ని, దీనివ‌ల్ల అన్యాయం జరుగుతుంద‌ని జ‌గ‌న్ నిరశ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఈ విషయంలో కూడా ఏపీ సర్కారు ఏమీ చేయడం లేదనే చర్చే ప్రజల్లో నడుస్తోంది.

ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి చేసినట్లుగా కనిపించకపోతే ప్రజల ముందు చాలా చులకన అయిపోతాం అని చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు తమలో తాము రకరకాలుగా చర్చించుకున్నారట. విజయవాడలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. మంత్రుల మాటల మధ్య ఒక అభిప్రాయం వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీని గట్టిగా నిలదీసే ధైర్యం తమకు లేదు క‌నుక కనీసం తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల విషయంలోనైనా గట్టిగా పోరాడ‌కపోతే డిఫెన్స్ నుంచి బ‌య‌ట‌ప‌డలేమ‌ని వారు భావిస్తున్నార‌ట‌.

అయితే అది చంద్రబాబు నిర్ణయ పరిధిలో ఉంటుంది గనుక.. ఆయన తానుగా పూనుకుంటే తప్ప.. త‌మ పరువు కాపాడుకునే పరిస్థితి లేదని మంత్రులు విచారిస్తున్నారట. మ‌రోవైపు తెలంగాణ ప్రాజెక్టుల అంశంపై జ‌గ‌న్ దూకుడుగా ముందుకు వెళుతుండ‌డంతో అది రాజ‌కీయంగా జ‌గ‌న్ ఎక్క‌డ మైలేజ్ ఇస్తుందో అన్న ఆందోళ‌న కూడా టీడీపీ మంత్రులు, నాయ‌కుల్లో ఉంద‌ని తెలుస్తోంది.