Begin typing your search above and press return to search.

రేవంత్‌ వ్యాఖ్య‌ల‌పై ఏపీ టీడీపీ నేత‌ల ఫైర్‌

By:  Tupaki Desk   |   7 Jan 2017 7:30 PM GMT
రేవంత్‌ వ్యాఖ్య‌ల‌పై ఏపీ టీడీపీ నేత‌ల ఫైర్‌
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ తెదేపా సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఆంధ్రులకు కోట్లు - తెలంగాణ వారికి లక్షలు ఇస్తున్నారని, తెలంగాణకు సంబంధం లేని పీవీ సింధుకు రూ. నాలుగు కోట్లు ఇవ్వడాన్ని తప్పుపట్టిన రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రాంతీయ పంచాయితీకి కారణమయ్యాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. ఎవరెస్ట్ అధిరోహించిన తెలంగాణ బిడ్డలయిన పూర్ణ - ఆనంద్‌ లకు 25 లక్షలు ఇచ్చామని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్.. తెలంగాణకు సంబంధం లేని పీవీ సింధుకు రూ. 4 కోట్లు బహుమానంతో పాటు, రూ. 10 కోట్ల విలువ చేసే స్థలాన్ని కూడా కానుకగా ఇచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందని పీవీ సింధుకు కోట్ల రూపాయలతోపాటు వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్ - తెలంగాణ బిడ్డలైన పూర్ణ - ఆనంద్‌ లకు 200 గజాలైనా ఇచ్చారా అని నిలదీసిన వైనం మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

జాతీయ పార్టీగా మారిన తెలుగుదేశంలో ఇప్పుడు ప్రాంతీయ పంచాయితీకి తెరలేచింది. రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా పక్కనే సండ్ర వీరయ్య కూడా ఉండటంపై నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోటాలో ఆంధ్రలోని టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అనుభవిస్తున్న సండ్ర కూడా ఆయనతో కలసి మాట్లాడటమే దానికి కారణం. తెలంగాణ క్రీడాకారులయిన ఆనంద్ - పూర్ణలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం-అన్యాయం జరిగిందని చెప్పడం వరకూ తప్పులేదని, కానీ ఏపీకి చెందిన పీవీ సింధుకు నిధులు - స్థలం ఎలా ఇచ్చారని ప్రశ్నించడం సమంజసం కాదని తెదేపా నేతలు స్పష్టం చేస్తున్నారు. పీవీ సింధుకు మిగిలిన రాష్ట్రాలు కూడా నజరానాలు ప్రకటించాయని గుర్తు చేస్తున్నారు. నిజంగా రేవంత్‌ రెడ్డి విమర్శల ప్రకారం వ్యవహరిస్తే తెలంగాణ నేతలకు ఏపీలో ఏ విధంగా పదవులు వస్తాయన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే తమకు రావలసిన వాటాను తెలంగాణ నేతలు కోటాల పేరుతో అనుభవిస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో అవి బహిరంగంగానే చర్చనీయాంశమవుతున్నాయి.

రాష్ట్రం కలసి ఉన్నప్పుడు కూడా తెలంగాణ నేతలే పెత్తనం చేశారని, కొందరు కులం పేరుతో, మరికొందరు ప్రాంతం పేరుతో పార్టీపై తమ అభిప్రాయాలు రుద్దారని అంటున్నారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక తెలివైన సామాజికవర్గం తమ మూలాలు ఏపిలో ఉన్నాయని చెప్పి - కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోనూ తమ వాటాను దెబ్బతీశారంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్య - హైదరాబాద్‌ కు చెందిన సాయన్నకు టీటీడీ సభ్యత్వాలు ఇచ్చారని - సాయన్న తెరాసలోకి ఫిరాయించిన తర్వాత ఆయన స్థానంలో నిజామాబాద్‌కు చెందిన అరికెల నర్సారెడ్డిని నియమించిన విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి రావులపాటికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ - వరంగల్ జిల్లాకు చెందిన ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌ కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ - ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ పాత్రికేయుడు శ్రీనివాస్‌ కు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ లో సీఎం ఓఎస్డీగానూ నియమించిన వైనాన్ని ఏపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాజాగా విజయవాడ కనకదుర్గ గుడి పాలకవర్గంలోనూ ఇద్దరు తెలంగాణ నేతలకు అవకాశం ఇచ్చారంటున్నారు. ఈవిధంగా కోటా పేరుతో తమ వాటాను దెబ్బతీయడమేమిటని ఏపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వీరంతటి సమర్థులు ఏపీలో లేరా? అని నిలదీస్తున్నారు. ఈ విషయంలో తమ నాయకత్వం కూడా పునరాలోచించాలంటున్నారు. ‘రేపు అక్కడ మా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రావాళ్లకు పదవులిస్తారా? ఒకవేళ ఇచ్చినా అక్కడి వాళ్లు చూస్తూ ఊరుకుంటారా? మరి మా వాటాను ఎందుకు దెబ్బతీయడం? ముందు రేవంత్ తెలంగాణ కోటా కింద పదవులు తీసుకున్నవారితో రాజీనామాలు చేయించి తర్వాత మాట్లాడితే మంచిది’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/