Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల ఓట్లు కేసీఆర్ కేనంట

By:  Tupaki Desk   |   4 Dec 2015 5:27 AM GMT
ఆంధ్రోళ్ల ఓట్లు కేసీఆర్ కేనంట
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్ ఉప ఎన్నికల్లో సొంతం చేసుకున్న చారిత్రక విజయం వాపు కాదన్న విషయం తేల్చాల్సిన అవసరం ఆసన్నమైంది. దీనికి తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు.. త్వరలో జరగనున్న గ్రేటర్ తో పాటు.. పలు నగరపాలక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటాలని తెలంగాణ అధికారపక్షం భావిస్తోంది.

ఇందుకోసం పక్కా స్కెచ్ గీస్తున్న తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి పలు సర్వేలు నిర్వహించినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జనవరిలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన విస్తృత సర్వే ఒకటి ముఖ్యమంత్రి చేయించినట్లుగా చెబుతున్నారు.

గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరాలన్న బలమైన కోరికతో ఉన్న కేసీఆర్.. ఊహించిన దాని కంటే సానుకూల ఫలితాలు సర్వేలో వచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ రావటం కష్టమన్న అభిప్రాయానికి భిన్నంగా గాలికి తమకు అనుకూలంగా వీస్తున్నట్లుగా సర్వే రిపోర్ట్ తేల్చాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఉండే ప్రాంతాల్లో సైతం తెలంగాణ రాష్ట్రసమితికి 52 శాతానికి పైగా ఓట్లు పడతాయన్నఅంచనాలు వ్యక్తమవుతున్నట్లుగా సర్వేలు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో తిరుగులేని రాజకీయ పక్షంగా అవతరించిన టీఆర్ఎస్ పట్ల సానుకూల ధోరణిలో ఆంధ్రా ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని సర్వే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలన్నా.. తమ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అదికారపక్ష చేయూత అత్యవసరమైన నేపథ్యంలో.. ఆంధ్రా ఓటర్లు సైతం తెలంగాణ అధికారపక్షం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ అధికారపక్షానికి ప్రత్యామ్నాయం లేకపోవటం.. తమ ఓట్లు వృధా కాకుండా పోవటంతో పాటు.. తెలంగాణ అధికారపక్షానికి తాము వ్యతిరేకమన్న భావన.. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందన్న భయాందోళనలు ఆంధ్రా ఓటర్లలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఆంధ్రా ఓటర్లలో మెజార్టీ.. టీఆర్ఎస్ పార్టీ వైపు రావటం ఒక పెద్ద పరిణామంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన పరిణామాలు ఎన్ని చోటు చేసుకుంటాయో చూడాలి.