Begin typing your search above and press return to search.

ఏపీ సైట్ ను ‘టీ’ అధికారి హ్యాకింగ్ చేశారా?

By:  Tupaki Desk   |   7 July 2016 5:39 AM GMT
ఏపీ సైట్ ను ‘టీ’ అధికారి హ్యాకింగ్ చేశారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలు సరిపోనట్లుగా కొత్తగా.. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్’’ వ్యవహారం రెండురాష్ట్రాల మధ్య కొత్త రచ్చను రాజేస్తున్న సంగతి తెలిసిందే. తాము అప్ లోడ్ చేసిన సమాచారాన్ని ఏపీకాపీ కొట్టిందంటూ సైబర్ నేరంగా నమోదు చేయటమే కాదు.. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీసుకెళ్లటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అసలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ విషయంలో తెలంగాణ సహా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తాము ముందు ఉన్నామని.. గత ఏడాదే తాము రెండోస్థానంలో ఉన్నప్పుడు కాపీ చేయాల్సిన ఖర్మ తమకు ఎందుకు పడుతుందన్నది ఏపీ వాదన.

అంతేకాదు.. తాము అప్ లోడ్ చేసిన సమాచారాన్ని తమకు కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలిసే అవకాశం లేదని.. అలాంటప్పుడు తమ సమాచారం తెలంగాణ సర్కారు తెలుసుకుందంటే.. తమ వెబ్ సైట్ లోకి అనధికారికంగా చొరబడి తమ సమాచారాన్ని సేకరించినట్లుగా కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది. తెలంగాణ అధికారులు అనధికారికంగా తమ సైట్ లోకి చొరబడటం.. కచ్ఛితంగా హ్యాకింగే అవుతుందని చెబుతున్న ఏపీ సర్కారు.. ఈ అంశంపై విచారణకు ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ వివాదం తెర మీదకు వచ్చిన తర్వాత ఏపీకి చెందిన అధికారులు కొందరు ఈ అంశంపై దృష్టి సారించి.. లోతులకు వెళ్లగా.. ఈ నెల 2న తెలంగాణ సీఎం కార్యలయంలో పని చేస్తున్న అధికారి ఒకరు తమ సైట్ లో చొరబడినట్లుగా ఏపీ అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాము సమాచారాన్ని అప్ లోడ్ చేసిన తర్వాత.. తమ సైట్ లోకి ఎవరెవరు ప్రవేశించారన్న అంశంపై ఏపీ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత అధికారికంగా స్పందిస్తామని చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ ‘కాపీ’ యవ్వారం మరింత ముదిరే ఆవకాశం ఉందన్న మాట స్పష్టంగా కనిపిస్తుందని చెప్పకతప్పదు.