Begin typing your search above and press return to search.

నవ నిర్మాణ దీక్షలు..చంద్రబాబుకు చుక్కలు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:58 AM GMT
నవ నిర్మాణ దీక్షలు..చంద్రబాబుకు చుక్కలు
X
మూడేళ్ల పాలన ముగుస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు జనం నాడి మెల్లమెల్లగా అర్థమవుతోంది. మూడేళ్లుగా చెబుతున్న కాకమ్మ కథలను జనం నమ్మడం లేదని చంద్రబాబుకు అర్థమవుతోంది. ఇంకా బయటపడకపోయినా... పార్టీలోని ముఖ్యనేతల వద్ద మాత్రం ఆయన ఇప్పటికే దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. న‌వ‌నిర్మాణ దీక్ష‌ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న నెగటివ్ స్పందన చూసి చంద్రబాబుకు సీను అర్థమవుతోందని టీడీపీ నేతలే అంటున్నారు.

నవ నిర్మాణ దీక్షల తొలిరోజు చంద్రబాబు సభకు జనం లేక పరువు పోయింది. చంద్రబాబు అంత హడావుడి చేసినా ఫలితం లేకపోవడంతో జనం తన మాటలు నమ్మడం లేదని ఆయనకు ఫస్టు రోజునే అర్థమైపోయింది. అయితే.. రెండో రోజు నేతలపై ఒత్తిడి చేసి జనాలను తేగలిగారు. కానీ... వచ్చిన జనం ఊరికే కూర్చోలేదు. ప్రశ్నలతో చంద్రబాబును చీకాకు పెట్టారు.

విజయవాడలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో అవినీతిపై చంద్ర‌బాబుకి సూటిప్ర‌శ్న‌లు వేశారు మ‌హిళ‌లు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన జ‌న్మ‌భూమి కమిటీల అవినీతిపై నిల‌దీశారు. టీడీపీ పాలనలో నెలకొన్న అవినీతిపై నేరుగా సీఎం చంద్రబాబునే మహిళలు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అవినీతి వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫించ‌న్ దగ్గర నుంచి ఏ చిన్న ప‌ని కావాల‌న్నా జ‌న్మ‌భూమి కమిటీలు డ‌బ్బులు అడుగుతున్నాయ‌ని గోడువెళ్ల‌బోసుకున్నారు. ఓ ఫాంపై సంత‌కం కోసం వెళితే డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో సంత‌కాలు పెట్ట‌లేద‌ని శిరీష అనే మహిళ సీఎం ముందు వాపోయింది. తాను డబ్బులు ఇవ్వలేకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేదని, ఇలాగైతే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ ఇళ్లు - పెన్షన్ల మంజూరులో అవినీతి జరుగుతున్నదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవినీతి కారణంగా తన భర్తకు 60 ఏళ్లు నిండినా పెన్షన్‌ రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జనం అసలు సంగతి బయటపెట్టేటప్పటికి చంద్రబాబుకు భయం పట్టుకుందట. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందనేది ఈ దీక్షల ద్వారా తెలిసిందంటున్నాయి విపక్షాలు కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/