Begin typing your search above and press return to search.

గిరిజనుల గాంధీ గిరి.. జగన్ సర్కారు తీరుపై తమకు తామే చెప్పులతో కొట్టుకున్నారు

By:  Tupaki Desk   |   8 July 2022 3:02 AM GMT
గిరిజనుల గాంధీ గిరి.. జగన్ సర్కారు తీరుపై తమకు తామే చెప్పులతో కొట్టుకున్నారు
X
సరికొత్త గాంధీగిరికి కేరాఫ్ అడ్రస్ గా మారింది అనకాపల్లి జిల్లా. కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ కావటం.. దీనిపై ఇప్పటికే పలుమార్లు అధికారుల్ని కలిసి.. కలిసి విసుగు చెందిన వారు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరసన తెలిపే ప్రక్రియల విషయంలో ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉన్నాయో తెలిసిందే. నిరసన పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలకు.. చర్యలకు తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున తిప్పలు పడాల్సి వస్తోంది.

ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారు అనకాపల్లి జిల్లాలో నిరసన చేపట్టిన నిరసనకారులు. ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే ప్రక్రియలో భాగంగా వారు వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది.

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవురాపల్లి మండలంలో తమకు రోడ్డు సౌకర్యం లేని తీరుపై గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తమకెంతో అవసరమైన రోడ్డు డిమాండ్ ను పట్టించుకోని ప్రభుత్వంపై వారు ఆగ్రహంతో ఉన్నారు.

ఎన్నికల వేళలో.. తాను గెలిచి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం కమ్ ఏపీ పంచాయితీ రాజ్ మంత్రి ముత్యాల నాయుడు తన నియోజకవర్గం (మాడుగల)లోని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. డిప్యూటీ సీఎంగా.. మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ తమకు మాత్రం రోడ్డు సౌకర్యం లేని వైనంపై వారు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వారు.. ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు బుద్ది వచ్చిందంటూ.. తమ చెప్పులతో తాము కొట్టుకున్న వైనం షాకింగ్ గా మారింది.ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిర్వహించిన ధర్నాలో భాగంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలనాయుడ్ని గెలిపించి తప్పు చేశామని.. అందుకు తమకు తాము చెప్పులతో కొట్టుకొని నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికైనా తమ కష్టాన్ని తొలగించాలని వారు కోరుతున్నారు. రోడ్డు కోసం పద్నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి అధికారులకు విన్నపాలు ఇచ్చినా తమ సమస్య తీరటం లేదని.. వచ్చేసారి ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ది చెబుతామంటూ ఏపీ డిప్యూటీ సీఎంకు హెచ్చరిక జారీ చేశారు. మరి.. డిప్యూటీ సీఎం ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.