Begin typing your search above and press return to search.

అమరావతి రాజధాని అంటే...ఇక అంతేనా...?

By:  Tupaki Desk   |   5 May 2022 1:30 AM GMT
అమరావతి రాజధాని అంటే...ఇక అంతేనా...?
X
అమరావతి పేరులోనే పురాణ నేపధ్యం ఉంది. చారిత్రాత్మకమైన ప్రస్థావన ఉంది. అమరావతి ఇంద్రుడి నగరం. ఇక్కడ తెలుగు చంద్రుడు కలల రాజధాని కూడా అదే. అలాంటి అమరావతిని మూడేళ్ళుగా వైసీపీ సర్కార్ అసలు ఏ మాత్రం పట్టించుకోలేదని ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఘాటు విమర్శలే చేశారు. అమరావతిని ఈ స్థితికి తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇపుడు రాజధాని నిర్మాణానికి అప్పులు కావాలని బయల్దేరడం ఆశ్చర్యమని ఆయన దుయ్యబెడుతున్నారు.

బంగారు బాతుగుడ్డు లాంటి అమరావతి రాజధాని పరపతిని దారుణంగా దెబ్బ తీసిన ఘనత వైసీపీదే అని ఆయన అంటున్నారు. ఎపుడైతే జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతిని నీరుకార్చారో నాటి నుంచే ఇబ్బందులు మొదలయ్యాయని కూదా ఆయన విశ్లేషిస్తున్నారు.

తాము అధికారం నుంచి దిగిపోయినపుడు అమరావతిలో చాలా భవనాల నిర్మాణం పనులు డెబ్బయి  నుంచి ఎనభై శాతం దాకా పూర్తి అయ్యాయని, వాటికి కొద్ది శాతం నిధులను కేటాయిస్తే ఏనాడో పూర్తీ అయ్యేవని, కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకుండా మూడేళ్ళుగా పాడుపెట్టిందని ఆయన మండిపడ్డారు.

ఇపుడు సీయార్డీఏ ద్వారా మూడు వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నాలు చేయడాన్ని తప్పు పట్టారు. అమరావతి పేరు చెబితే ఏ ఒక్కరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటే ఆ పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. అసలు అప్పు ఎందుకు చేయాలి, ప్రభుత్వం సొంత నిధులను అమరావతి నిర్మాణాల కోసం ఎందుకు కేటాయించదని ఆయన నిలదీస్తున్నారు. మొత్తానికి మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతి మూడ్ ని పూర్తిగా మార్చేశారని ఆయన నిందిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే అమరావతి రాజధాని పరపతి నిజంగా తగ్గిపోయిందా. లేక వైసీపీ సర్కార్ కి అమరావతి రాజధాని అభివృద్ధి చేయదు అన్న అనుమానం ఉందా అన్న చర్చ అయితే ఒక వైపు గట్టిగానే  సాగుతోంది. ఒకనాడు అమరావతి చుట్టూనే అభివృద్ధి అంటూ సాగిన కధ కాస్తా ఇపుడు వేరే విధంగా మారడం అంటే ఆలోచించాల్సిందే సుమా.