Begin typing your search above and press return to search.

తీపి మాట‌లెందుకు జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   9 July 2022 2:41 AM GMT
తీపి మాట‌లెందుకు జ‌గ‌న్ ?
X
రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌రువాత సొంతంగా ఓ పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా నాటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో అధినేత్రి సోనియా గాంధీని కాద‌ని, తిరుగుబాటు చేసి వైసీపీని నెల‌కొల్పారు. తాము పార్టీకి ఎంతో చేశామ‌ని కానీ పార్టీ నుంచి ద‌క్కింది ఏమీ లేద‌ని వాపోతూ కాంగ్రెస్ ను ఉద్దేశించి అప్ప‌ట్లో జ‌గ‌న్ వ‌ర్గం వ్యాఖ్య‌లు చేసేవారు. అన్నీ అయ్యాక వైసీపీ ప్రారంభం షురూ అయింది.

ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కూ పార్టీని న‌డిపేందుకు ముఖ్య నాయ‌కులతో పాటు వారి అనుచ‌రులూ, కార్య‌క‌ర్త‌లు శ‌క్తివంచ‌న లేకుండా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. ముఖ్య నాయ‌కుల్లో ఎలానూ చెవిరెడ్డి లాంటి వారికి ప‌ద‌వులే లేవు. అయినా కూడా వారు విధేయులుగానే ఉంటూ వ‌స్తున్నారు. అదేవిధంగా కార్య‌క‌ర్త‌ల బాగు కోసం కొంద‌రు నాయ‌కులు ఎంతో కొంత ఉన్నంత‌లో సాయం చేస్తున్నా , పార్టీ త‌ర‌ఫున మాత్రం వారికి భ‌రోసా లేదు. నిరుత్సాహ ప‌డ‌కండి మీకు మేమున్నాం అని చెప్పేందుకు జ‌గ‌న్ ఎందుకో ఇష్ట‌ప‌డ‌డం లేదు.. అన్న విమ‌ర్శ కూడా వినిపిస్తోంది. తీపి మాట‌లే త‌ప్ప చేదు నిజాల‌ను మాత్రం వైసీపీ అధిష్టానం ఎందుక‌నో అంగీక‌రించ‌డం లేదు.

కార్య‌క‌ర్త‌ల‌కు సెల్యూట్ చేస్తున్నా అని చెప్పారు జ‌గ‌న్. 13 ఏళ్ల ప్ర‌యాణంలో త‌మ వెన్నంటే ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను మ‌రోసారి త‌ల్చుకున్నారు జ‌గ‌న్. ఇదీ నిన్న‌టి వైసీపీ ప్లీన‌రీలో జ‌రిగిన ఆస‌క్తిదాయకం అయిన పరిణామం. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ కార్య‌క‌ర్త‌ల కోసం క‌నీసం ఏం చేస్తామో అన్న‌ది చెప్ప‌డం మ‌రిచిపోయారే అని సొంత నేతల గుసగుస.

తాము కార్య‌క‌ర్త‌ల కోసం బీమా సౌక‌ర్యాన్ని వ‌ర్తింప‌జేయ‌డం, చనిపోయిన కుటుంబాల‌కు వీలున్నంత వ‌ర‌కూ ఐదు నుంచి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల మేరకు సాయం చేయ‌డం చేస్తున్నామ‌ని మ‌రి! వైసీపీ మాత్రం ఇవేవీ ప్ర‌క‌టించ‌కుండానే ప్లీన‌రీలో మొద‌టి రోజు మాట్లాడి ఉంద‌ని అంటున్నారు వాళ్లు.

వాస్త‌వానికి ఏ పార్టీకి అయినా కీల‌కం కార్య‌క‌ర్త‌లే. న‌డిపేది,న‌డిపించేది వాళ్లే. గ్రామాల్లో తోటి పార్టీ నాయ‌కుల నుంచి తిట్లు తింటూ కూడా పార్టీ జెండాలు మోసేది కూడా వాళ్లే. వీలున్నంత వ‌ర‌కూ పార్టీకి త‌మ జీవం జ‌వం నింపేది వాళ్లే. కానీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక వ‌లంటీర్ వ్య‌వ‌స్థ తెచ్చాక ఒక్క‌సారిగా ప‌రిణామాలు అన్నీ మారిపోయాయి. వ‌లంటీర్లంతా పై చేయి సాధిస్తూ వ‌స్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

రెండు ప్ర‌ధాన ఎన్నిక‌ల్లో తాము అన్నీ అయి న‌డిపినా కూడా లాభం లేకుండా పోయింద‌న్న వాద‌న కూడా ఉంది. ఇప్పుడు ప్లీనరీలో అయినా కార్య‌క‌ర్త‌ల ఊసు అస్స‌లు లేదు. కార్య‌క‌ర్త‌లు అంటే స్వ‌చ్ఛందంగా ప‌నిచేసేవార‌ని, వారు ఏమీ ఆశించ‌కూడ‌ద‌నే మాట మాత్రం కొంద‌రు నాయ‌కుల నుంచి వినిపించింది. ప‌ద‌మూడేళ్లు అన్నీ తామై న‌డిపాక ఇప్పుడీ విధంగా త‌మ‌కేమీ ద‌క్క‌నివ్వ‌కుండా, కనీసం ప‌నులు చేప‌ట్టినా కూడా బిల్లులు ఇవ్వ‌కుండా చుక్క‌లు చూపించ‌డం భావ్య‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు వీళ్లంతా.. సెల్యూట్ లు స‌రే కాస్త పెండింగ్ బిల్లులు ఇవ్వండి లేదా ఇప్పించండి అని అంటున్నారు కార్య‌క‌ర్త‌లు.