Begin typing your search above and press return to search.

వ‌రద‌లు వ‌చ్చాయి వెళ్లాయి త‌రువాత ?

By:  Tupaki Desk   |   2 Aug 2022 3:30 PM GMT
వ‌రద‌లు వ‌చ్చాయి వెళ్లాయి త‌రువాత ?
X
ఇంత‌కాలం సాయం అందిస్తున్నార‌ని అనుకోవాలి. లేదా వ‌ర‌ద‌ల త‌రువాత ప్ర‌భుత్వం చేప‌ట్టివ‌న్నీ కంటి తుడుపు చ‌ర్య‌లే అని భావించాలి. ఇదీ ఇవాళ గోదావ‌రి తీరాల్లో నిర‌స‌న‌ల వేళ విప‌క్షం వినిపిస్తున్న మాట. వ‌ర‌ద‌లు వ‌చ్చాక విప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌ర్య‌టన త‌రువాత (క్షేత్ర స్థాయిలో ) ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్క‌డికి చేరుకున్నారు. గ‌త ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజ‌యాన్ని అందించిన గోదావ‌రి తీరాల్లో ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ అంత‌గా స్పందించిన దాఖ‌లాలే లేవు. ముఖ్య‌మంత్రి వ‌చ్చాక చేసిన హ‌డావుడే త‌ప్ప మ‌రొక‌టి లేదు.

ఇదే సమ‌యంలో పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌న రామానాయుడు నిరంత‌రాయంగా సేవ‌లందించేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. వీలున్నంత వ‌ర‌కూ బాధిత వ‌ర్గాల‌కు భోజ‌నం పెట్టారు. బాధిత ప్రాంతాల్లో రాత్రి పూట బ‌స చేసి, ఉద‌యం ఇంటికే లేచి అధికారులను అప్ర‌మ‌త్తం చేసేవారు.

ఈ పాటి కూడా అధికార పార్టీ స‌భ్యులు చేయ‌లేక‌పోయార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆమాట‌కు వ‌స్తే జ‌న‌సేన కూడా వీలున్నంత వ‌ర‌కూ త‌న వంతు సాయం అందించింది. కొన్ని బాధిత ప్రాంతాల‌కు ప‌డ‌వ‌ల్లో చేరుకుని మ‌రీ స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో త‌న‌వంతు బాధ్య‌త అందించింది.

అదేవిధంగా చాలా చోట్ల స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా త‌మ వంతు బాధ్య‌తను నిర్వ‌ర్తించి,మాన‌వత చాటుకున్నాయి. ఇదే స‌మయంలో సీఎం ప‌ర్య‌ట‌న త‌రువాత కొన్నిమార్పులు అయినా క్షేత్ర స్థాయిలో వ‌స్తాయేమో అని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఇళ్లు కోల్పోయిన వారు ఇప్ప‌టికీ స‌హాయక శిబిరాల్లోనే బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. కొంద‌రికి ఇప్ప‌టికీ పూర్తి స్థాయి భోజ‌నం అంద‌డం లేదు. ముఖ్య‌మంత్రి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఎంపిక చేసిన బాధితుల‌తోనే మాట్లాడించడం వివాదాల‌కు తావిచ్చింది.

ఇక న‌ష్టాల అంచ‌నా అన్న‌ది ఓ కొలిక్కి రాలేదు. ఇంటికి యాభై నుంచి ల‌క్ష రూపాయ‌లు త‌క్ష‌ణ సాయం కింద అందించినా స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు ఊర‌ట ద‌క్కేలా లేదు. కొన్నిళ్లు అయితే ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల వ‌ర‌కూ సామానులు పోగొట్టుకున్నారు.

వారి విలువైన ఎల‌క్ట్రిక్ వ‌స్తువులు ఎందుకూ ప‌నికిరాకుండాపోయాయి. ఇప్ప‌టికీ చాలా చోట్ల స‌హాయ‌క చ‌ర్య‌లు కానీ భోజ‌న ఏర్పాట్లు కానీ ఏమీ ఆశించిన స్థాయిలో లేవు అన్న‌ది ఓ వాస్త‌వం. మ‌రి ! ప్రతిపక్ష ఎమ్మెల్యే చేసినంత‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌ని ?