Begin typing your search above and press return to search.

ఏపీ అంటే లైట్ తీసుకున్నారా మోడీజీ...?

By:  Tupaki Desk   |   12 Nov 2022 7:33 AM GMT
ఏపీ అంటే లైట్ తీసుకున్నారా మోడీజీ...?
X
ఎవరైనా ప్రధాని స్థాయిలో ఉన్న నాయకుడు తమ ప్రాంతం వచ్చినపుడు ఏమైనా వరాలు ఇస్తారని ఆశించడం సహజం. విశాఖ ప్రజలు కూడా గత పదిహేను రోజులుగా అలాంటి ఆశలతోనే ఉన్నారు. మొత్తానికి అనుకున్న డేట్ కి మోడీ విశాఖ వచ్చారు. ఆయన ఏపీ గురించి ఏమి చెబుతారా ఏ వారలు ఇస్తారా అని అయిదు కోట్ల మంది ఆంధ్రా జనాలు కళ్లకు వత్తులేసుకుని మరీ చూశారు.

తీరా మోడీ ప్రసంగం విన్నాక నిరాశతోనే అంతా ఉండిపోయారు. మోడీ 2015 తరువాత ఏపీకి వచ్చి పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మళ్ళీ ఆయన ఏపీకి సంబంధించి ఈ అభివృద్ధి పనులలోనూ పాలుపంచుకోలేదు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ళుగా మిగిలిపోయిన విభజన హామీల గురించి ఆయన చెప్పాల్సినది ఎంతో ఉంది.

అలాగే తాము ఇవ్వాల్సినది, చేసినది ఏమైనా ఉంటే అది కూడా చెప్పాలి. కానీ మోడీ అలా చేయలేదు. ఆయన విశాఖలో అరగంట పాటు ఇచ్చిన స్పీచ్ వింటే అందులో చాలా భాగం విశాఖ గొప్పదనం, అంధ్రుల మంచితనం గురించి ఉంది. ఇక మిగిలినది చూస్తే దేశంలో తాము చేస్తూ వస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి.

నిజానికి దేశంలో చేపట్టిన ఏ కార్యక్రమం అయినా దాని ఫలాలు అందరికీ దక్కుతాయి. వాటిని అంతా పొందుతారు. కానీ ప్రత్యేకించి ఒక ప్రాంతానికి వెళ్ళినపుడు వారికి చేయాల్సిన పనులు ఏంటి అన్న అజెండా ఒకటి ఉంటుంది. ఏపీ చూస్తే విభజనతో నానారకాలుగా ఇబ్బందులు పడుతోంది. అలాంటి రాష్ట్రాన్ని దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగా జమ కట్టేసి అంతా బాగుందని చెప్పేయడం అంటే కళ్ళ ముందు చూస్తూ కూడా పట్టించుకోకపోవడమే అని అంతా అంటున్నారు.

మోడీ కూడా ఈ విషయంలో అలాగే చేశారు అని అంటున్నారు. ఆయన విభజనతో ఏపీ తీవ్ర నష్టాల పాలు అయింది అన్నది గమనించారా లేక దాన్ని అలా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారా అన్నది తెలియడంలేదు అంటున్నారు. ఏపీకి ఎంతో చేయాలి, ఎంతో ఇవ్వాలి, కానీ మోడీ సార్ మాత్రం కేంద్ర పధకాలతో దేశమంతా బాగుంటుంది. అందులో భాగమైన ఏపీ కూడా బాగానే ఉంటుంది అని భావించినట్లున్నారు. అందుకే ఆయన తన స్పీచ్ లో దేశం గురించి ఎక్కువగా మాట్లాడారు, ఏపీ గురించి ఏమీ చెప్పకుండా వదిలేశారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి.

విశాఖ వచ్చిన ప్రధాని కేంద్ర పధకాలను వల్లె వేయడమేమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. అలాగే విభజన హామీల గురించి ప్రస్థావన కనీసంగా కూడా లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఏపీకి తాము ఏం చేశామో చెప్పలేకనే ఇలా కేంద్రం గొప్పలు చెప్పుకున్నారా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ప్రధాని విశాఖ వచ్చి కొత్తగా ప్రకటించినది ఏదీ లేదనే అంటున్నారు. దీంతో ఏపీ జనాలు తీవ్ర నిరాశలో మునిగారు.

ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థపానకు వచ్చినపుడు తట్టెడు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చారని విమర్శలు మూటకట్టుకున్న ప్రధాని ఈసారి అవి కూడా తీసుకురాలేదు అని హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు అంతా. ఏపీ లో రాజకీయంగా తమకు లాభం లేదనే ఇలా లైట్ తీసుకున్నారని అంటున్నారు. అందువల్లనే ఏపీకి అర చేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.