Begin typing your search above and press return to search.

పవన్ ఇచ్చిన షాక్ తో బీజేపీలో అలజడి...మిత్రులమే అంటూ...

By:  Tupaki Desk   |   19 Oct 2022 11:30 AM GMT
పవన్ ఇచ్చిన షాక్ తో బీజేపీలో అలజడి...మిత్రులమే అంటూ...
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో ఓపిక నశించినట్లుంది. అందుకే ఆయన బీజేపీకి పక్కన పెట్టేసినట్లుగా ఉన్నారు. అదే టైం లో చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ షేక్ హ్యాండ్ బీజేపీని ఒక్క లెక్కన షేక్ చేసి పారేస్తోంది. అసలే ఏపీలో బీజేపీ పెద్దగా లేదు. పవన్ చరిష్మాతో ఏదో విధంగా నెట్టుకుని రావాలని చూస్తున్న బీజేపీకి పవన్ మార్క్ ఝలక్ ఇపుడు గంగవెర్రులెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీ నాయకుల మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

అసలు ఏమి జరిగింది. పవన్ని అలా ఎందుకు వదిలేశారు అని కేంద్ర పెద్దలు ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో జరిగిన జరుగుతున్న పరిణామాలను ఎప్పటికపుడు కేంద్ర పెద్దలకు వివరైంచడంతో రాష్ట్ర నాయకత్వం సరిగ్గా వ్యవహరించలేదు అని అంటున్నారు. దాని ఫలితమే ఇపుడు కేంద్ర పెద్దలు కూడా పవన్ వంటి సినిమా గ్లామర్ ఉన్న మాస్ హీరో, ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేత తమకు దూరం కావడాన్ని ఒకింత షాక్ గానే చూస్తున్నారు అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు ఉన్నారు. ఆయన ఏపీలో జరిగిన పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్ర పెద్దలు మాత్రం పవన్ తో బంధాన్ని కొనసాగించాలనే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానే అడుగులు ఉండాలని అంటున్నారు. అదే టైం లో పవన్ మిత్రుడిగానే చూడాలని, ఆయన ఆలోచనలు తెలుసుకుని సమస్యలు ఉంటే పరిష్కరించాలని సూచించారని అంటున్నారు.

దీంతోనే బెంగుళూరులో ఉన్న సోము వీర్రాజు బీజేపీతో జనసేన బంధం గట్టిగానే ఉందని చెబుతున్నారని అంటున్నారు. అంతే కాదు బీజేపీ జనసేన కలసి ముందుకు వెళ్తాయని ఆయన అంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలని అంటున్నారు. నిజానికి ఏపీ బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతారు. ఒక వర్గం వైసీపీతో రిలేషన్స్ కోరుకుంటే మరో వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటారు. ఈ వర్గ పోరు వల్లనే సరైన సమాచారం కేంద్ర పెద్దలకు చేరలేదని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేంద్ర పెద్దల ఆలోచనలు ఇప్పటి నుంచే పొత్తుల వైపుగా లేవు అని అంటున్నారు. టీడీపీతో నిజానికి ఏపీలో పొత్తు పెట్టుకోవాలనుకున్న అది 2024 మొదట్లోనే తీసుకునే నిర్ణయం తప్ప ఈ రోజుకు కాదు అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీతో రాజ్యసభలో బీజేపీకి మద్దతు వంటి అవసరాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందు ఢిల్లీలో మరోసారి అధికారం ముఖ్యం.

2024 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గితే ఏపీ నుంచి సాయం కావాలని వారు కోరుకుంటారు. ఏపీలో వైసీపీ టీడీపీలలో ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వారితోనే తమ భవిష్యత్తు బంధాలను వారు ఉంచుకుంటారని అంటున్నారు. అందువల్ల అన్ని ఆప్షన్లను ఓపేన్ గా ఉంచుకుని 2024 ఎన్నికల వేళనే వాటిని బయటకు తీయాలని వారి ఉద్దేశ్యం. అయితే ఏపీలో మాత్రం పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.

దాంతో పవన్ వెళ్ళి చంద్రబాబుతో షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. అయితే పవన్ తో బంధాన్ని అలాగే కొనసాగేలా చూడమని కేంద్ర పెద్దలు ఏపీ నాయకత్వాన్ని ఆదేశించారని అంటున్నారు. మరి అది జరిగే పనేనా ఏపీలో వైసీపీతో కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉన్నంతకాలం పవన్ ఈ వైపు చూడరు అన్నది అందరికీ తెలిసిందే. అందువల్ల 2024 వరకూ పవన్ని మిత్రుడిగా చెప్పుకుంటూ బీజేపీ ముందుకు సాగడం అంటే కుదిరేది కాదనే అంటున్నారు. మొత్తానికి పవన్ ఇచ్చిన షాక్ తో బీజేపీలో అలజడి రేగుతోంది అన్నది వాస్తవం. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.