Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న పంచాయితీ : ఏడు వేల రోడ్ల‌కు మోక్షం ఎన్న‌డో ?

By:  Tupaki Desk   |   15 Jun 2022 1:30 AM GMT
జ‌గ‌న‌న్న పంచాయితీ : ఏడు వేల రోడ్ల‌కు మోక్షం ఎన్న‌డో ?
X
ఆంధ్రావ‌ని వాకిట రోడ్ల‌కు మోక్షం ద‌క్క‌డం లేదు. ఆరు లైన్ల పేరిట జాతీయ ర‌హ‌దారులను కేంద్రం అత్యంత అధునాతన ప‌ద్ధతుల్లో వేసి, ఎక్క‌డిక్క‌డ ఫ్లై ఓవ‌ర్లు, బై పాస్ లు, అండర్ పాస్ లు నిర్మించి ఇచ్చింది.

కానీ జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చాక మాత్రం కొన్ని ప‌నులు అలానే ఉండిపోయి, పాల‌కుల నిర్ల‌క్ష్యాన్ని చాటిచెబుతున్నాయి అన్న‌ది విప‌క్షం వాద‌న. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో అస్త‌వ్య‌స్తంగా ఉన్న రోడ్లకు మోక్షం ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగా కొన్ని ప‌నుల‌కు అనుమ‌తులు ఇచ్చి, టెండ‌ర్లు పిలిచి నిధుల మంజూరు ప్ర‌క్రియ కూడా పూర్తి చేశారు.

కానీ అప్ప‌టి ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొన్ని ప‌నులు మంద‌కొడిగా సాగాయి.దీంతో కేటాయించిన నిధుల‌లో ఇర‌వై ఐదు శాతం క‌న్నా త‌క్కువ‌గా చేప‌ట్టిన ప‌నుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ర‌ద్దు చేసింది. దీంతో ఏడు వేల 282 రోడ్ల ప‌నులు ఆగిపోయాయి. టెండ‌ర్లు ర‌ద్దు చేసినా, ప‌నులు నిలిపివేసినా లేదా రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరిట మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ ప‌నుల‌కు సంబంధించి కొత్త కాంట్రాక్ట‌ర్ల‌ను పిలిచినా ప‌నులు జ‌ర‌గాలి.

కానీ జ‌ర‌గ‌లేదు. అస్స‌లు ఇప్ప‌టిదాకా నిలిచిన ఏ ఒక్క రోడ్డు ప‌ని కూడా ఇంత వ‌ర‌కూ ముందుకు వెళ్ల‌లేదు. దీంతో ఈ ప‌నులకు మోక్షం క‌ల్పించేందుకు పీఆర్ ఇంజినీర్లు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా ఉంద‌నే తెలుస్తోంది.

వాస్త‌వానికి తెలుగుదేశం ప్ర‌భుత్వం దిగిపోతూ దిగిపోతూ కొన్ని ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక్క‌డే అసలు త‌ప్పిదం జ‌రిగింది. కొన్ని ప‌నులు వేగం చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను తొంద‌ర‌పెట్టి ప‌నులు చేయించింది.

కానీ కొన్ని మాత్రం అప్ప‌టి స్థానిక యంత్రాంగం నిర్ల‌క్ష్యం కార‌ణంగానో లేదా స్థానిక నాయ‌క‌త్వాల స‌మర్థ‌త లోపం కార‌ణంగానో ఆగిపోయాయి. వాటికి నిధులు ఇచ్చి మ‌ళ్లీ ప‌నులు చేయాలని ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ప‌ట్టుబ‌ట్టినా నిధులు అయితే లేవు అన్న‌ది ఎప్పుడో తేలిపోయింది. క‌నుక ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం నుంచి కాస్తో కూస్తో నిధులు తెచ్చ‌యినా ఆగిన ప‌నుల‌కు మోక్షం ఇస్తే మేలు అన్నది ఆయా గ్రామాల ప్ర‌జల అభ్య‌ర్థ‌న.