Begin typing your search above and press return to search.

ఏపీలో యాత్రా స్పెష‌ల్‌.. ఎవ‌రి గోల వారిదేనా? ప్ర‌జ‌ల గోడు వింటారా?

By:  Tupaki Desk   |   30 April 2022 4:13 AM GMT
ఏపీలో యాత్రా స్పెష‌ల్‌.. ఎవ‌రి గోల వారిదేనా?  ప్ర‌జ‌ల గోడు వింటారా?
X
రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. అయితే.. ఈ సారి.. ఎండ‌ల‌తో పాటు రాజ‌కీయాలు అంత‌కు మించిన రేంజ్‌లో మండిపోనున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఎందుకంటే.. మే 10వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ 'ఇంటింటికీ.. వైసీపీ' పేరుతో యాత్ర‌లు ప్రారంభించ‌నున్నది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా .. జూన్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ యాత్ర‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. వైసీపీ ఇప్ప‌టికే.. జిల్లాల‌కు బాధ్యుల‌ను నియ‌మించింది.

అదే స‌మ‌యంలో వీరిని న‌డిపించేందుకు పైన మంత్రుల‌ను ఇంచార్జ్‌లుగా నియ‌మించింది. అదేవిధంగా జిల్లాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను కూడా నియ‌మించింది. దీంతో మే 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా.. ఇంటింటి కీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం.. ప్ర‌భుత్వం చేసిన కార్య‌క్ర‌మాలు, చేస్తున్న సంక్షేమాన్ని వినిపించాల‌ని.. సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే పార్టీ నాయ‌కుల‌కు దిశా నిర్దేశించారు.

అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడుసార్లు ఈ యాత్ర చేప‌ట్టాల‌ని.. జ‌నాల‌ను క‌ల‌వాల‌ని ఆయ‌న నిర్దేశించారు. అయితే.. ఇక్క‌డ మౌలిక ప్ర‌శ్న ఏంటంటే.. స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తారా? చేయ‌రా? అంటే.. వీరు చెప్పే సొదేనా.. జ‌నాల బాధ‌లు వింటారా? విన‌రా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌మాచారం మేర‌కు ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మేళ్ల‌ను మాత్ర‌మే వినిపించాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు.

దీంతో నాయ‌కులు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై కుస్తీ ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు మాత్రం త‌మ స‌మ‌స్య‌లు వినిపించేందుకు వ‌చ్చే అవ‌కాశం వినియోగించుకోవాల‌ని ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కార్య‌క్ర‌మం ఎలా ముందుకు సాగుతుంద‌నేది వైసీపీ నేత‌ల్లోనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌గా మారింది.

ఇదిలావుంటే.. మ‌హానాడు ముగియ‌గానే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. టీడీపీ కూడా నిర్ణ‌యించింది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే రెండేళ్ల‌కాలంలో జిల్లాల వ్యాప్తంగా ప్ర‌తి ఇంటికి తిర‌గాల‌ని నిర్ణ‌యించా రు. ఈ క్ర‌మంలో రాబోయే ఏడాది పాటు రాష్ట్రంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ యాత్రా స్పెష‌ల్ సాగ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. ఇక్క‌డ చిక్కేంటంటే.. వైసీపీ ఏమో.. తాము ఇది చేశాం.. అది చేశాం.. ఇంత డ‌బ్బులు పంచాం.. అంత డ‌బ్బులు పంచాం.. ఇళ్లు ఇచ్చాం.. అని చెబుతుంది. కానీ, టీడీపీ ఏమో..అది చేయ‌లేదు. ఇది చేయ‌లేదు. ఇది స‌మ‌స్య‌.. అది స‌మ‌స్య అని చెబుతుంది. దీంతో ప్ర‌జ‌లు ఎవ‌రి వాద‌న వింటారు.. ఎవ‌రి వైపు నిలుస్తారు? అనేది ఒక‌టైతే.. ఈ రెండు పార్టీల నేత‌లు..అస‌లు త‌మ బాధ‌లు వింటారా.. లేదా.. అని జ‌నాలు చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.