Begin typing your search above and press return to search.

మాట త‌ప్పుతాం.. మ‌డ‌మ తిప్పుతాం.. వైసీపీ నేత‌లు కూడా ఇంతేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 6:30 AM GMT
మాట త‌ప్పుతాం.. మ‌డ‌మ తిప్పుతాం.. వైసీపీ నేత‌లు కూడా ఇంతేనా?
X
మాట త‌ప్పం.. మ‌డ‌మ త‌ప్పం... వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పేమాట‌. ఆయ‌న ఊత‌ప‌దం కూడా. అయితే అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న చాలాసార్లు మాట త‌ప్పారు.. మ‌డ‌మ తిప్పార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి.

శాస‌న‌మండ‌లిని ర‌ద్దు తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపి మ‌ళ్లీ తూచ్ అన‌డం, రాజ‌ధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)ను ర‌ద్దు చేస్తూ చ‌ట్టం చేసి మ‌ళ్లీ దాన్ని వెన‌క్కి తీసుకున్నామ‌ని కోర్టులో పిటిష‌న్ వేయ‌డం, మూడు రాజ‌ధానుల ఏర్పాటు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మ‌ళ్లీ కోర్టులో దాన్ని వెన‌క్కి తీసుకున్నామ‌ని అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌టానికి సంపూర్ణ అంగీకారం తెలిపి.. ఇప్పుడు మూడు రాజ‌ధానుల పాట పాడ‌టం, సీపీఎస్ ర‌ద్దు చేస్తాం అని చెప్పి సాంకేతిక కార‌ణాల‌తో అది సాధ్యం కాద‌ని ఇప్పుడు చెప్ప‌డం..... ఇలా జ‌గ‌న్ మాట త‌ప్పారు.. మ‌డ‌ప తిప్పారు అన‌డానికి చాలా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇప్పుడు త‌మ అధినేత జ‌గ‌న్ బాటలోనే ఆ పార్టీ నేత‌లు కూడా ఉన్నార‌ని అంటున్నారు. తాజాగా మూడు రాజ‌ధానుల సెగ ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. మూడు రాజ‌ధానులకు మ‌ద్ద‌తుగా ఉత్త‌రాంధ్ర వైసీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేశాన‌ని కొద్ది రోజుల క్రితం హ‌ల్‌చ‌ల్ చేశారు. అయితే అది ఉత్తిదేన‌ని తేలిపోయింద‌ని చెబుతున్నారు. క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీలానే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస‌రావు, తదిత‌రులు సైతం రాజీనామాలు చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా ఒక్క‌రూ చేయ‌లేదు.

పైగా క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ కూడా త‌న రాజీనామాపై వెన‌క్కి త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇక ఇటీవ‌ల కాలంలో తామెందుకు రాజీనామా చేయాల‌ని.. టీడీపీ నేత‌లే రాజీనామా చేయాల‌ని ఉత్త‌రాంధ్ర మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నారు. త‌ద్వారా తాము రాజీనామాలు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. దీంతో రాజీనామా ద్వారా హ‌ల్చ‌ల్ చేసిన క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ కూడా ఇప్పుడు వెన‌క్కి త‌గ్గారు.

అమరావ‌తే రాజ‌ధాని కావాలంటే టీడీపీ నేత‌లే ఆ నినాదంతో రాజీనామాలు చేయాల‌ని ఇప్పుడు వైసీపీ నేత‌లు రివ‌ర్స్ డిమాండ్ వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డంలో త‌మ అధినేత జ‌గ‌న్‌ను వైసీపీ నేత‌లు ఫాలో అవుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

మూడు రాజ‌ధానుల‌పై రాజీనామాలు చేసేంత ధైర్యం వైసీపీ నేత‌ల‌కు లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ద‌మ్ముంటే రాష్ట్ర ప్ర‌జ‌లంతా మూడు రాజ‌ధానుల కోరుకుంటున్నార‌ని రాజీనామాలు చేసి ప్ర‌జా తీర్పు కోరాల‌ని స‌వాళ్లు విసురుతున్నారు. అయితే అంత ధైర్యం వైసీపీ నేత‌లు చేయ‌డంలేదు. ముందులో ఢీ అంటే ఢీ అన్న వైసీపీ నేత‌లు గ్రౌండ్ లెవ‌ల్ ప‌రిస్థితి ఏమిటో తెలియ‌బ‌ట్టే రాజీనామాల‌కు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.