Begin typing your search above and press return to search.

ట్రంప్ చేతులు క‌ట్టుకొన్న వేళ‌..!

By:  Tupaki Desk   |   11 Jun 2018 4:46 AM GMT
ట్రంప్ చేతులు క‌ట్టుకొన్న వేళ‌..!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విలో కూర్చునే అర్హ‌త ఏ మాత్రం లేద‌ని చెప్పే దేశాధినేత‌ల పేర్ల‌లో ట్రంప్ పేరు ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంద‌న్న మాట‌ను ఆయ‌న్ను వ్య‌తిరేకించేవారు చెబుతారు. త‌ర‌చూ ఏదో ఒక వివాదంలో ట్రంప్ పేరు వినిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం ట్రంప్ తో సంబంధం లేకుండానే ఆయ‌న వార్త‌ల్లోకి వ‌చ్చేశారు.

ఆయ‌న‌కు సంబంధించిన ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ పుణ్య‌మా అని ట్రంప్ ఇప్పుడు అంద‌రూ మాట్లాడుకునేలా చేశారు. తెలుగు సినిమా భాష‌లో చెప్పాలంటే.. అగ్ర‌రాజ్య అధినేత ట్రంప్ ను వివిధ దేశాధినేత‌లు రౌండ‌ప్ చేసిన‌ట్లుగా ఉన్న ఈ ఫోటోలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ట్రంప్ చేతులు క‌ట్టుకొని కూర్చోవ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఏదో అంశంపై ట్రంప్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్న‌ట్లుగా ఈ ఫోటో ఉండ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలో జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలీ మెర్కెల్ బ‌ల్ల మీద చేతులు పెట్టి ట్రంప్ ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా ఉండ‌టం.. వివిధ దేశాధినేత‌లు ట్రంప్ చుట్టు మూగి ఉండ‌టం క‌నిపిస్తుంది. ముఖానికి గంటు పెట్టుకున్న చందంగా ట్రంప్ చేతులు క‌ట్టుకొని సీరియ‌స్ గా కూర్చోవ‌టం క‌నిపిస్తుంది.

జ‌ర్మ‌నీ ఛాన్సల‌ర్ ప‌క్క‌నే జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే.. యూఎస్ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జాన్ బోల్ట‌న్‌.. జ‌పాన్ విదేశీ వ్య‌వ‌హారాల స‌హాయమంత్రి కేజాయూకి య‌మ‌జాకి.. జ‌పాన్ డిప్యూటీ చీఫ్ కేబినెట్ సెక్ర‌ట‌రీ య‌సుతోషి నిషిరుమా.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయ‌ల్ మేక్రాన్‌.. యూకే ప్ర‌ధాని థెరిసా మే.. యూఎస్ నేష‌న‌ల్ ఎకాన‌మీ కౌన్సిల్ డైరెక్ట‌ర్ ల్యారీ కుడ్లోలు ఉన్నారు. జీ 7 దేశాల స‌ద‌స్సు సంద‌ర్భంగా ఈ ఫోటోను తీశారు. ఈ ఆస‌క్తిక‌ర ఫోటోను జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం గ‌మ‌నార్హం.

జ‌ర్మ‌నీ మంత్రివ‌ర్గానికి చెందిన అధికారిక ఫోటోగ్రాఫ‌ర్ జెస్కోడెన్ట్ తీసిన ఈ ఫోటోలో ట్రంప్ ను బ‌లంగా ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా జ‌ర్మ‌నీ చాన్స‌ల‌ర్ ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ మొత్తం సీన్లో ట్రంప్ డిఫెన్స్ లో ప‌డ్డ‌ట్లుగా చేతులు క‌ట్టుకొని ఉండటం గ‌మ‌నార్హం. జీ 7 దేశాల స‌ద‌స్సు త‌ర్వాత మెర్కెల్‌.. జ‌స్టిన్ ట్రూడ్యూ త‌దిత‌రుల‌పై ట్రంప్ మండిప‌డ్డారు. దానికి కార‌ణం.. ట్రంప్ ను ముఖ్య‌నేత‌లంతా నిల‌దీయ‌ట‌మే కార‌ణ‌మ‌న్న‌ట్లుగా తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చెబుతున్న‌ట్లుగా ఉంద‌ని చెబుతున్నారు. త‌న‌ను చిన్న‌బుచ్చేలా ఉన్న ఫోటో మీద ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.