Begin typing your search above and press return to search.

పిలుస్తున్నా ఆగని మంత్రిపై ఇలా చేశారు!

By:  Tupaki Desk   |   17 Sept 2016 4:33 PM IST
పిలుస్తున్నా ఆగని మంత్రిపై ఇలా చేశారు!
X
రాజకీయ నాయకులంటే ప్రజాసేవకులు - ప్రజా రక్షకులు వంటి రోజులు - నేతలు పోయి... వారేదో పైనుంచి వచ్చినట్లు, వారు నాయకులు అవ్వడం ప్రజల అదృష్టం అన్నట్లు - తమకు కోపం రప్పిస్తే ప్రజాసేవ ఆపేస్తాం అని బెదిరిస్తున్నట్లు ప్రవరిస్తుంటారు కొంతమంది నేతలు. అలాంటి నేతల గురించి బాదపడే రోజులుపోయి ఎదురుతిరగడం - ఇంక్ చల్లడం చేసే రోజులు వచ్చాయి. ఒక కేంద్రమంత్రిపై - ప్రజాప్రతినిధిపై ఇంక్ జల్లడం సరైన చర్యేనా అని ప్రశ్నించేవారికి... ప్రజలు చెప్పే సమస్యలు వినకుండా పలాయనం చిత్తగించడం సదరు ప్రజాసేవకుడికి కరెక్టా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి! తాజాగా ఎయిమ్స్ కి వెళ్లిన కేంద్రమంత్రికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.

అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ ఎయిమ్స్ కు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను అదే కళాశాల మెడిసిన్ విద్యార్థులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. తమకు అందుబాటులోకి వచ్చిన కేంద్ర మంత్రికి తమ సమస్యలు విన్నవించుకోవాలనుకున్న విద్యార్థుల ఆశను అడియాశలు చేస్తూ ఆ మంత్రి గారు ఆగకుండా వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎంతగా పిలిచినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆయనపై ఇంక్ చల్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తమ కాలేజీలో ఉన్న సమస్యల గురించి మంత్రిగారికి విన్నవించుకుందామని విద్యార్థులు వస్తే.. ఆయన అలా వెళ్లిపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలేజీలో అనేక సమస్యలున్నాయని.. సరైన అధ్యాపకులు లేరని.. వసతి కూడా అత్యంత దారుణంగా ఉందని.. ఈ సమస్యలన్నింటినీ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే... ఆయన ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశారని.. ఆ క్రమంలో ఎలాగైనా మంత్రిని ఆపాలనే ఇంక్ చల్లాం తప్ప మరో ఉద్దేశం కాదని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ పద్దతి మార్చుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.