Begin typing your search above and press return to search.

జలీల్ ఖాన్ ను కడిగి పడేశారు

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:42 AM GMT
జలీల్ ఖాన్ ను కడిగి పడేశారు
X
ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అయిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రోడ్ల విస్తరణలో భాగంగా దేవాలయాల్ని ఇప్పటికే తొలగించి లేని తలనొప్పుల్ని నెత్తి మీదకు తెచ్చుకున్న ఏపీ సర్కారు తాజాగా.. మసీదుల్ని తొలగించేందుకు సమాయుత్తమవుతుందన్న సమాచారం ముస్లింలను ఆగ్రహానికి గురి చేస్తుంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత సమావేశమైన ముస్లింలు.. ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండించటంతోపాటు.. మసీదులు.. ఖబరస్థాన్ లను కూల్చేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న హెచ్చరికను చేస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. రాబోయే కాలంలో కాబోయే మైనార్టీ మంత్రిగా చెబుతున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ఆగ్రహంతో ఉన్న ముస్లింలను సముదాయించేందుకు రంగంలోకి దిగారు. వారి సమావేశానికి వెళ్లిన ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది. అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ.. మసీదులు.. దర్గాలు.. ఖబరస్తాన్ లను కూల్చుడేందంటూ విరుచుకుపడటంతో పాటు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తీవ్రస్థాయిలో మండిపడటంతో వారిని ఎలా శాంతింపచేయాలో అర్థం కాక నీళ్లు నమిలిన పరిస్థితి.

రామవరప్పాడు మసీదు కూల్చివేత అంశంలోనూ ముస్లింలను మభ్యపెట్టి ప్రభుత్వానికి అండగా నిలిచావంటూ జలీల్ ఖాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు ఆయనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ‘‘అధికారపార్టీకి తొత్తుగా ఉంటూ మసీదులు.. దర్గాలు.. ఖబరస్తాన్ లు కూలుస్తున్నావు. జాతిజాతి అంటూ ముస్లింలను తాకట్టు పెడుతున్నావు’’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని శాంతింపచేసేందుకు విపరీతంగా ప్రయత్నించిన జలీల్ ఖాన్.. తాను ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకెళతానని చెప్పినా.. వారు వినిపించుకోని పరిస్థితి. తాజా పరిణామాలు జలీల్ ఖాన్ కు షాకింగ్ గా మారాయి.