Begin typing your search above and press return to search.

తెలంగాణలో 17న బంద్.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Nov 2018 11:23 AM GMT
తెలంగాణలో 17న బంద్.. ఎందుకో తెలుసా?
X
తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతున్న సమయాన త్వరలోనే బంద్ జరగబోతుండటం గమనార్హం. సాధారణంగా ప్రజా సమస్యలపై బంద్ లు జరుగుతుంటాయి. కానీ ఈసారి ఈ బంద్ కు కారణం వేరు. రాజకీయాల్లో బీసీలకు కోటాను డిమాండ్ చేస్తూ ఈ బంద్ కు పిలుపు ఇవ్వడం విశేషం. తెలంగాణ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చే విషయంలో రాజకీయ పార్టీలన్నీ అన్యాయమే చేస్తున్నాయంటూ బీసీ సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 17న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి.

అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో 105 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే అందులో 20 మంది మాత్రమే బీసీలున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించిన 65 స్థానాల్లో 13 మంది బీసీలకే చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ 9 మందితో ప్రకటించిన తొలి జాబితాలో ఇద్దరు బీసీలకు అవకాశం లభించింది. తెలంగాణలో బీసీ ఓటర్ల గణనీయంగా ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లుగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండట్లేదని.. ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయట్లేదని.. ఈ నేపథ్యంలో వారికి పొలిటికల్ కోటా పెంచాల్సిందేనంటూ బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి.

ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా బీసీలకు అన్యాయమే జరుగుతోందని.. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదని.. అందుకే బంద్ కు పిలుపు ఇస్తున్నామని సంఘాలు అంటున్నాయి. బీసీల్ని అన్ని పార్టీలూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని.. ఎన్నికలప్పుడు తమను మభ్యపెట్టి తర్వాత తమను అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా తమకు న్యాయం చేయాల్సిందే అని.. బీసీలకు సీట్లు పెంచాలని.. లేకుంటే ఎన్నికల్లో తమ దెబ్బ రుచి చూపిస్తామని అంటున్నాయి సంఘాలు.