Begin typing your search above and press return to search.

29 వేల కోట్ల ఆస్తులను అమ్మ‌నున్న అంబానీ!

By:  Tupaki Desk   |   28 Jun 2017 8:34 AM GMT
29 వేల కోట్ల ఆస్తులను అమ్మ‌నున్న అంబానీ!
X
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ క‌ష్టాలు ఇంకా తీర‌లేదు. ఓ వైపు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న బ్యాంకుల రుణాలపై ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మ‌రోవైపు బ్యాంకులు కూడా కంపెనీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆర్ కామ్ కు ఇప్పటికే రూ.45వేల కోట్ల వ‌ర‌కు రుణాలున్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దెబ్బకు ఈ రుణాలు భారీగా పెరిగాయి. దీంతో షేర్లు 60 శాతం పడిపోయాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అనిల్ అంబానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మర్ అసెట్ సేల్ ను పొడిగించాల‌ని అనిల్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగా అనిల్ ఆధ్వ‌ర్యంలోని కంపెనీల రోడ్డు ఆస్తులను, సముద్రగర్భంలోని వ్యాపారాలను, ముంబై, ఢిల్లీలోని ప్రైమ్ రియల్ ఎస్టేట్ లను అమ్మ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ్రూప్ కు చెందిన ఫోన్ ట్రాన్స్ మిషన్ టవర్లను విక్రయించడం, తమ వైర్ లెస్ ఆపరేషన్లను ఎయిర్ సెల్ లిమిటెడ్ లో విలీనం చేయడం వంటివి ఈ అమ్మ‌కాల‌లో ప్ర‌ధానమైన‌వి. ఈ రెండు డీల్స్ త‌ర్వాత కూడా ఇంకా నిధులు అవ‌స‌ర‌మైతే వారం వ్యవధిలోనే రెండు ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్లు చేపట్టాలని గ్రూప్ కు చెందిన ఫైనాన్స్ యూనిట్లు నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. గ్రూప్ రుణాలను మూడింతలు తగ్గించడానికి రూ.29,038కోట్ల నిధుల స‌మీక‌ర‌ణే అనిల్ ల‌క్ష్య‌మ‌ని తెలిసింది.

బ్యాంకుల ఒత్తిడితో కంపెనీల వ్యవస్థాపకులు తమ ఆస్తులను అమ్మడానికి సిద్దమవుతున్నాయని ముంబైకి చెందిన టీసీజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చక్రి లోకప్రియ చెప్పారు. దేశ చరిత్రలో ఒక కంపెనీ ఇంత పెద్దమొత్తంలో రుణ పునర్వ్యవస్థీకరణకు పాల్పడ్డం ఇదే మొదటిసారి అని అనిల్‌ అంబానీ చెప్పిన సంగతి తెలిసిందే. తన కంపెనీ దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెంచడానికి ప్రయత్నిస్తుందని, అలాగే రుణాలు కూడా పరి మిత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/