Begin typing your search above and press return to search.

లోకేశ్ ది ‘సూపర్ బ్రైట్ మైండ్’ అంట

By:  Tupaki Desk   |   12 Jan 2016 4:49 AM GMT
లోకేశ్ ది ‘సూపర్ బ్రైట్ మైండ్’ అంట
X
అప్పుడప్పుడు ట్వీట్లు ఇవ్వటం.. పార్టీ కార్యకర్తలకు చేసే సాయాల గురించి చెప్పుకోవటం.. లాంటివి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ ట్విట్టర్ పేజీని చూస్తే కనిపిస్తాయి. ట్విట్టర్ పేజీ నుంచి బయటకు వచ్చి లోకేశ్ ను గమనిస్తే.. పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశాలు కావటం.. పార్టీ అంతర్గత వ్యూహాలకు పదును పెట్టే పనిలో బిజీగా ఉండటం.. ఎలాంటి అధికారిక బాధ్యత లేనప్పటికీ.. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఆరా తరచూ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తూ.. సమర్థుడిగా పార్టీలో పేరు తెచ్చుకున్నా.. బయట మాత్రం చినబాబు పెద్దగా ఫోకస్ కాలేదన్న మాట తరచూ వినిపిస్తుంది. మిగిలిన రాజకీయ వారసులకున్న మాస్ క్రేజ్ తో పోలిస్తే లోకేశ్ బాబుకు తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది.

తన వారసుడిగా లోకేశ్ ను ఎప్పుడో చంద్రబాబు డిసైడ్ చేసినా.. తాను మొయిన్ స్ట్రీమ్ లో ఉన్న నేపథ్యంలో.. కొడుకుపై విమర్శలు వెల్లువెత్తకుండా ఆచితూచి ప్రమోట్ చేస్తూ జాగ్రత్తపడుతుంటారు చంద్రబాబు. మాట వరసకు కూడా కొడుకు గురించి ఒక్క పొగడ్త కూడా పొగడరు. తానే కాదు.. తన పార్టీ నేతల చేత కూడా బయట అనవసర భజన చేయించేందుకు ఇష్టపడరు.

అలాంటి చంద్రబాబుకు చిత్రమైన అనుభవం ఎదురైంది. తాజాగా విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ.. లోకేశ్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. తాను లోకేశ్ తో భేటీ అయ్యానని.. అత్యున్నత విద్యార్హతలతో పాటు.. రాజీయాల పట్ల అతనికున్న విజన్ ఏమిటో అర్థమైందన్న అనిల్.. ‘‘లోకేశ్ సూపర్ బ్రైట్ మైండ్’’ అంటూ పొగిడేశారు. ఇంత భారీగా పొగడ్త బహిరంగం వినిపించటం.. అది కూడా అనిల్ అంబానీ లాంటి వ్యాపార దిగ్గజం కాంప్లిమెంట్ ఇవ్వటంతో.. అక్కడే ఉన్న చంద్రబాబు ముఖంలో నవ్వులు విరజిమ్మాయి. కొడుకు సమర్థుడంటూ దేశ వ్యాపార దిగ్గజం కాంప్లిమెంట్ ఇస్తుంటే ఏ తండ్రికి మాత్రం సంతోషంగా ఉండదు. మొత్తానికి లోకేశ్ లోని మొనగాడు అనిల్ అంబానీకి కనిపించాడన్న మాట.