Begin typing your search above and press return to search.

ఇంతకీ అనిల్ అంబానీ అప్పులెంత బాస్?

By:  Tupaki Desk   |   20 April 2016 6:50 AM GMT
ఇంతకీ అనిల్ అంబానీ అప్పులెంత బాస్?
X
పారిశ్రామిక ప్రముఖులుగా పేరున్న పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఆస్తులన్నీ ఆస్తులు కావని.. వారి వెనుక బయటకు పెద్దగా కనిపించని భారీ అప్పులే ఉంటాయన్న కఠిన నిజం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఉదంతంతో బయటకు వచ్చింది. సంపన్నులుగా కనిపించే వారికి సైతం చాలానే అప్పులు ఉంటాయని.. బండి బాగా నడిచినంతకాలం అంతా బాగానే ఉంటుంది కానీ.. లెక్క తేడా వస్తేనే అసలుకే ఎసరన్న విషయం పలు ఉదంతాలు అసలు నిజాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. దాదాపు రూ.9వేల కోట్ల మేర బ్యాంకులకు ఉన్న అప్పుల్ని తీర్చకుండా.. గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా దెబ్బకు దేశంలో ఇలాంటి బడా బాబుల వివరాల మీద దేశ ప్రజలకు ఆసక్తి ఎక్కువైంది.

మంది సొమ్మును తమ సొమ్మే అన్నట్లుగా షోకులు పోయే పారశ్రామికవేత్తల మీద ఆరా మొదలు కావటంతో పాటు.. పారిశ్రామికవేత్తలకు ఉన్న ఆస్తులు.. అప్పుల మధ్య వ్యత్యాసం.. కంపెనీల అసలు బలం మీద కొత్తసందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది.

బ్యాంకుల వద్ద తాము తీసుకున్న అప్పుల్ని తీర్చేందుకు ఆస్తుల్ని అమ్మటం మొదలు పెట్టామని.. 2017 నాటికి అప్పుల్ని చెల్లిస్తామని అనిల్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ బుద్ధి మొదట ఏమైందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఉన్నట్లండి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా.. బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పుల్ని తీర్చే విషయం మీద ఆయన ప్రకటన ఎందుకు చేశారన్నది మరో ప్రశ్న. బ్యాంకు తీరు మారటమా? లేక.. ఆ ఒత్తిడి బయటకు వచ్చే దాని కంటే ముందే తానే ఓపెన్ అయిపోయి.. స్వీయ గడువుతో కొత్త కష్టాల్ని తప్పించుకోవాలన్న ఉద్దేశంతో అనిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్నది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చషురూ అయ్యింది. ఇక.. అనిల్ అంబానీ కంపెనీకి ఉన్న అప్పుల లెక్క ఎంతంటే సరైన లెక్కలు బయటకు రావటం లేదు.

అయితే.. బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులు తీర్చేందుకు అనిల్ అంబానీ గ్రూప్ తన ఆస్తుల్లో రూ.43,911 కోట్ల మేర అమ్మకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అనిల్ ప్రకటన బ్యాంకులకు ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నా.. ఉన్నట్లుండి అనిల్ ఈ తరహా ప్రకటన ఎందుకు చేశారన్నదే సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఏమైనా.. అనిల్ తరహాలోనే మిగిలిన పారిశ్రామికవేత్తలు తాము తీసుకున్న అప్పులు తీర్చేందుకు ప్రయత్నాలు షురూ చేస్తే మంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.