Begin typing your search above and press return to search.

బోకిల్ చెప్పిన మూడో బ్ర‌హ్మాస్త్రాన్ని మోడీ ప్ర‌యోగిస్తారా?

By:  Tupaki Desk   |   8 Nov 2017 6:16 AM GMT
బోకిల్ చెప్పిన మూడో బ్ర‌హ్మాస్త్రాన్ని మోడీ ప్ర‌యోగిస్తారా?
X
ఎవ‌రీ బోకిల్‌? అన్న డౌట్ వ‌చ్చిందా? కొంద‌రికి మాత్ర‌మే సుప‌రిచిత‌మైన ఈయ‌న అస‌లు పేరు అనిల్ బోకిల్‌. అర్థ‌క్రాంతి ప్ర‌తిష్ఠాన్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు. అంద‌రికి దూరంగా రామోజీ ఫిలింసిటీ కొండ మీద ఉండే మీడియా మొఘ‌ల్ రామోజీలాంటోడు సైతం బోకిల్ చెప్పే మాట‌లకు విప‌రీతంగా ప్ర‌భావితంకావ‌ట‌మే కాదు.. అర్థ‌క్రాంతి విధానాల్ని అమ‌లు చేస్తే ఎలా ఉంటుందంటూ గ‌తంలో భారీ స‌ద‌స్సును రామోజీ సిటీలో ఏర్పాటు చేశారు.

రామోజీని మాత్ర‌మే కాదు.. త‌న మాట‌ల‌తో.. త‌న విధానాల‌తో న‌రేంద్ర మోడీని సైతం ఆయ‌న ప్ర‌భావితం చేశారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోడీ ఉన్న కాలంలో ఆయ‌న్ను క‌లిసిన బోకిలే దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు చేయాల్సిన శ‌స్త్ర‌చికిత్స గురించి కొన్ని సూచ‌న‌లు చేశారు.

బోకిలే చేసిన సూచ‌న‌ల్లో ఒక‌టి పెద్ద‌నోట్ల ర‌ద్దు అయితే.. రెండోది జీఎస్టీ. ఈ రెండింటిని ఇప్ప‌టికే అమ‌లు చేసిన మోడీ.. ఇప్పుడు ఆయ‌న చెప్పిన మూడో సూచ‌న అయిన బీటీటీ. దీన్ని విడ‌దీసి చెప్పాలంటే బ్యాంకిం్ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్‌. ఈ విధానంలో ఏం చేస్తారంటే.. ప‌న్ను ఎగ‌వేత‌కు ఏ మాత్రం అవ‌కాశం ఉండ‌దు. అన్ని ప‌న్నుల్ని ర‌ద్దు చేసేసి.. కేవ‌లం ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే ట్రాన్సాక్ష‌న్ మీద‌న ప‌న్ను వేస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకులో రూ.500 డిపాజిట్ చేశార‌నుకుందా.. దానికి 2 శాతం ప‌న్ను వేస్తారు. ఒక‌వేళ‌.. ఏదైనా వ‌స్తువు కొందామ‌నుకున్నా మ‌రో 2 శాతం ప‌న్ను క‌ట్టాల్సిందే. మిగిలిన ప‌న్నులేమీ లేకుండా.. డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టే ప్ర‌తిసారీ ప‌న్ను క‌ట్టాల్సి ఉండ‌టం ఇందులో కీల‌క‌మైన అంశం. ఈ విధానంలో మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. రూ.50 మించిన నోట్లు అందుబాటులో ఉండ‌వు.

పెద్ద‌నోట్ల చెలామ‌ణీ అస్స‌లు ఉండ‌ని నేప‌థ్యంలో జేబులో నుంచి కానీ బ్యాంకు ఖాతాలో నుంచి కానీ చెల్లించే ప్ర‌తి రూపాయికి ప‌న్ను త‌ప్ప‌నిస‌రి అవుతుంది. దీంతో.. ప‌న్ను ఎగ‌వేత‌కు అవ‌కాశ‌మే ఉండ‌దు. చేతిలో న‌గ‌దు కంటే కూడా ఆన్ లైన్.. ప్లాస్టిక్ మ‌నీనే ఎక్కువ‌గా చెలామ‌నీ అవుతుంది. దీంతో ప‌న్ను ఆదాయం భారీగా పెరుగుతుంద‌న్న‌ది అంచ‌నా.

ఇలా వ‌సూలు చేసే ప‌న్నులో కేంద్రానికి 0.7శాతం.. రాష్ట్రానికి 0.6 శాతం.. స్థానిక సంస్థ‌ల‌కు 0.35.. లావాదేవీలు నిర్వ‌హించిన బ్యాంకుకు 0.35 శాతం చొప్పున వాటాలు లభిస్తాయి. ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే.. దేశంలో భారీ మార్పు రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఈ విధానానికి ఇప్ప‌టికే మెజార్టీ వ‌ర్గాలు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. మ‌రి.. మోడీ ఈ విధానానికి ఓకే అంటారా?అన‌్న‌దే ఇప్పుడు న‌డుస్తున్న హాట్ టాపిక్‌.

2013లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోడీ ఉన్న‌ప్ప‌డు ప‌రిచ‌య‌మైన బోకిలే.. ఆయ‌న‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న చెప్పిన రెండు కీల‌క అంశాల్ని మార్చిన మోడీ.. మూడోదైన బీటీటీ ప‌ద్ద‌తిని కూడా అమ‌లు చేస్తారా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఒక‌వేళ‌.. బీటీటీ విధానాన్ని అమ‌లు చేస్తే.. అదో మ‌రో సంచ‌ల‌నంగా మారుతుంద‌ని చెబుతున్నారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో విజ‌యంసాధించిన ప‌క్షంలో మోడీ.. త‌నపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు ప‌స‌లేనివిగా కొట్టిపారేసే వీలుంది. రెట్టించిన ఉత్సాహంతో బీటీటీని అమ‌ల్లోకి తేవొచ్చంటున్నారు. ఒక‌వేళ గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అనుకోని ఎదురుదెబ్బ త‌గిలితే మాత్రం బీటీటీని అమ‌లు చేసే సాహ‌సం చేయ‌ర‌ని భావిస్తున్నారు. ఏమైనా.. మోడీ బ్రాహ్మ‌స్త్రాన్ని సంధించాలంటే.. గుజ‌రాత్ ప్ర‌జ‌లు చెప్పే తీర్పు మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుందంటున్నారు.