Begin typing your search above and press return to search.

అనిల్ డేరింగ్ సవాల్..టీడీపీ స్వీకరిస్తుందా?

By:  Tupaki Desk   |   24 Sep 2019 3:52 PM GMT
అనిల్ డేరింగ్ సవాల్..టీడీపీ స్వీకరిస్తుందా?
X
ఓ నాలుగు నెలల ముందు జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో అధికార వైసీపీ - విపక్ష టీడీపీ మధ్య దాదాపుగా యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పక తప్పదు. వైరి వర్గాలు విరుసురుతున్న సవాళ్లకు ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే వైసీపీలో కీలక నేతగా - జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ విసిరిన సవాల్... ఇప్పుడు అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సవాల్ కు టీడీపీ శిబిరం నుంచి అసలు సమాధానమే వచ్చే ఛాన్సే లేదన్న కోణంలో అప్పుడే విశ్లేషణలు కూడా మొదలైపోయాయి.

అయినా అనిల్ కుమార్ విసిరిన సవాల్ ఏమిటన్న విషయానికి వస్తే... తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తుందని అనిల్ కాస్తంత గట్టిగానే చెప్పారు. రానున్న రెండేళ్లలోనే పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని కూడా అనిల్ చెప్పుకొచ్చారు. నిర్దేశించుకున్న మేరకే తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే... టీడీపీని మూసివేస్తారా? అని కూడా అనిల్ ఓ సంచలన సవాల్ ను విసిరారు.

అయినా ఈ సవాల్ ను అనిల్ ఎందుకు విసిరారన్న విషయానికి వస్తే... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రివర్స్ టెండర్లు వేసి ప్రభుత్వ ఖజానాకు రూ.780 కోట్ల మేర ఆదా చేస్తున్నామని అనిల్ చెప్పారు. రివర్స్ టెండరింగ్ ను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న టీడీపీ... రివర్స్ టెండర్లతో పోలవరం వ్యయాన్ని పెంచేశారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణం కూడా జాప్యమవుతుందని కూడా టీడీపీ వాదిస్తోంది. ఈ వాదనలను కొట్టిపారేస్తూ మీడియా ముందుకు వచ్చిన అనిల్... టీడీపీ ఆరోపణలకు తనదైన మార్కు జవాబిస్తూనే టీడీపీకి దిమ్మతిరిగే సవాల్ ను విసిరారు.

చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా కమీషన్ల కోసం పని చేశారని తనదైన శైలి ఆరోపణలు గుప్పించిన అనిల్... పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అనేది ఒక గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు మెచ్చుకోవాల్సింది పోయి అర్థం పర్థం లేకుండా విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని తాము చెప్పిన సమయానికే పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా? అని ఈ సందర్భంగా అనిల్ సవాల్ విసిరారు. పోలవరమే కాదు వెలిగొండ వంటి ప్రాజెక్టులపై కూడా రివర్స్‌ టెండరింగ్‌ కు వెళతామని ఆయన సంచలన ప్రకటన చేశారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని - పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారన్న వార్తలు సత్యదూరమని కూడా ఆయన పేర్కొన్నారు.