Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబును ఫాలో అవుతున్న ఆ మంత్రి?

By:  Tupaki Desk   |   3 Feb 2020 4:32 PM GMT
చంద్ర‌బాబును ఫాలో అవుతున్న ఆ మంత్రి?
X
గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి చాలా క‌బుర్లు చెప్పారు. విభ‌జ‌న హామీల్లో భాగంగా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర పోల‌వ‌రాన్ని పూర్తి చేయాల్సి ఉన్నా ఆ బాధ్య‌త‌లు చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుబ‌ట్టి తీసుకున్నారు. మామూలు హ‌డావుడి చేయ‌లేదు. ప్ర‌తి సోమవారం పోల‌వ‌రానికే అంకితం అంటూ చంద్ర‌బాబు నాయుడు త‌ర‌చూ స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. సోమ‌వారాన్ని పోల‌వ‌రానికి అంకితం ఇచ్చిన‌ట్టుగా.. సోమ‌వారం కాదు, పోల‌వ‌రం అంటూ హ‌డావుడి చేశారు. అంత జేసీ చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు క‌నీసం 15 శాతం కూడా పూర్తి కాలేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా కొన‌సాగింది ప‌రిస్థితి.

అప్ప‌ట్లో కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే కాకుండా.. నీటి పారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా పోల‌వ‌రం గురించి త‌ర‌చూ మాట్లాడేవారు. ఉమ మాట‌లు చంద్ర‌బాబు నాయుడుకు మించిన స్థాయిలో కోట‌లు దాటేవి. రాసుకో.. రాసుకో.. అంటూ ఉమ హ‌డావుడి చేసేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ఉద్దేశించి అప్ప‌ట్లో దేవినేని ఉమ ఏక‌వ‌చ‌నంతో మాట్లాడుతూ.. 2018కే పోల‌వ‌రాన్ని పూర్తి చేస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ హ‌డావుడి చేసేవాళ్లు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. 2018 పోయి 2019 వ‌చ్చింది, ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయినా పోల‌వ‌రం విష‌యంలో ప్రోగ్రెస్ రిపోర్టును చూపించ‌లేక‌పోయింది చంద్ర‌బాబు స‌ర్కారు. దీంతో తెలుగుదేశం పార్టీపై గ‌ట్టి దెబ్బ ప‌డింది. ఉత్తుత్తి మాట‌లు చెప్పిన టీడీపీని జ‌నాలు చిత్తు చేశారు. 23 సీట్ల‌కు ప‌రిమితం చేశారు. *రాసి పెట్టుకోండి..* అంటూ స‌వాల్ విసిరిన దేవినేని ఉమ ఎమ్మెల్యేగా కూడా నెగ్గ‌లేక‌పోయారు. అదీ గ‌త ఐదేళ్ల క‌థ‌.

ఇక ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ హ‌డావుడి మాట‌లు మాట్లాడుతున్నారు. పోల‌వ‌రం గురించి త‌ర‌చూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఉన్నారు. అదిగో.. ఇదిగో.. అంటున్నారు. 2021 అని ఈయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఏడాదికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌వుతుంద‌ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మ‌రోవైపు హైడ‌ల్ ప్రాజెక్టుకు సంబంధించి రివ‌ర్స్ టెండ‌రింగ్ పై న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు కొన‌సాగుతూ ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో అస‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోకుండా..మంత్రిగారు మాట్లాడుతున్న తీరు చంద్ర‌బాబు - దేవినేని ఉమ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌ను గుర్తు చేస్తూ ఉంద‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.