Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎంగా వైసీపీ ఫైర్ బ్రాండ్?

By:  Tupaki Desk   |   22 Jun 2020 2:30 PM GMT
డిప్యూటీ సీఎంగా వైసీపీ ఫైర్ బ్రాండ్?
X
ఇటీవల ముగిసిన ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నాలుగు సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ - మంత్రి మోపిదేవి వెంకటరమణ - ఆళ్ల అయోధ్య రామిరెడ్డి - పరిమళ్ నత్వానీలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి...పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో డిప్యూటీ సీఎం ఎవరు కాబోతున్నారన్న అంశాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ మంత్రి పదవులకు - డిప్యూటీ సీఎం పదవికి పలువురు ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రెండు మంత్రి పదవులు బీసీ సామాజికవర్గానికే కేటాయించాలని జగన్ భావిస్తున్నారట. డిప్యూటీ సీఎం పదవిని గతంలో మాదిరిగానే బీసీ సామాజిక వర్గానికే ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారట. అంతేకాదు - డిప్యూటీ సీఎం పదవి రేసులో యువ ఎమ్మెల్యే - నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉందట.

పిల్లి సుభాష్ చంద్రబోస్ విధేయతకు పట్టం కట్టి డిప్యూటీ సీఎం చేసిన జగన్...విధేయత కోటాలోనే అనిల్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారట. బీసీల్లోని 139 కులాల్లో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందని అనిల్ అయితే...సామాజిక వర్గాల ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందని జగన్ యోచిస్తున్నారట. ఇప్పటికే వైసీపీ - జగన్ వీర విధేయుడైన అనిల్...రెండోసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి దక్కించుకున్నారు. అదే విధేయతను పరిగణలోకి తీసుకున్న జగన్...అనిల్ ను మరో మెట్టుపైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీలోని సీనియర్లతో కూడా ఈ విషయంపై జగన్ చర్చించారట. మరి, పరిశీలనలో ఉన్న అనిల్ పేరు డిప్యూటీ సీఎం పదవికి ఖరారవుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.