Begin typing your search above and press return to search.

మ‌చిలీప‌ట్నంలో `జంబో` సంద‌డి!

By:  Tupaki Desk   |   24 July 2018 1:04 PM GMT
మ‌చిలీప‌ట్నంలో `జంబో` సంద‌డి!
X
మ‌చిలీప‌ట్నంలో టీమిండియా మాజీ కోచ్ - మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప‌ర్య‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి భ‌విష్య‌త్ లో ఒలింపిక్ స్థాయి ఆట‌గాళ్ల‌ను వెలికితీసేందుకు ఏపీ స‌ర్కార్ చేప‌ట్టిన ప్రాజెక్ట్ గాండీవ‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లో అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. మ‌చిలీప‌ట్నంలో దాదాపు 13 కోట్ల రూపాయలతో వ్య‌యంతో నిర్మించనున్న అథ్లెటిక్ స్టేడియానికి - మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనాలకు కుంబ్లే శంకుస్థాపన చేశారు. 13.27 ఎకరాల్లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంతోపాటు - స్విమ్మింగ్‌ పూల్ ను నిర్మించనున్నారు. దాంతోపాటు - భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ గా సేవలందించిన తెలుగు తేజం సీకే నాయుడు విగ్రహాన్ని మచిలీపట్నం (బందరు)లో కుంబ్లే ఆవిష్కరించారు. మ‌రో ఏడాదిలో ఈ స్టేడియం పూర్త‌వుతుంద‌ని - ఇక్క‌డ నుంచి ఒలింపిక్ స్థాయి ఆట‌గాళ్లు రావాల‌ని జంబో ఆకాంక్షించారు. సీకే నాయుడు విగ్ర‌హం ఆవిష్క‌రిస్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. టీమిండియాకు నాయుడు విశేష సేవలందించారని కుంబ్లే కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర పాల్గొన్నారు. కుంబ్లేకు శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. క్రీడలకు పుట్టిల్లైన మచిలీపట్నంలో స్టేడియం నిర్మించడం గర్వకారణమని - ఇక్క‌డి నుంచి వంద‌లాది క్రీడాకారులను తయారుచేస్తామని రవీంద్ర తెలిపారు. స్టేడియం నిర్మాణానికి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయ‌ని - అయినా వాటిన్నింటినీ అధిగమించి - లక్ష్యాన్ని నెరవేరుస్తామ‌ని అన్నారు. ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చేందుకు జాతీయ - అంతర్జాతీయ కోచ్ లను తీసుకొస్తామన్నారు. స్టేడియంతోపాటు స్పోర్ట్స్‌ హాస్టల్ ను కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు. కాగా, ఈ స్టేడియానికి మొత్తం రూ.50 కోట్లతో అంచనాలను పంపగా, ప్రభుత్వం తొలిదశలో రూ.13 కోట్లు విడుదల చేసింది.