Begin typing your search above and press return to search.

మంత్రిగారి సరదా ఖర్చు.. జస్ట్ కోటి మాత్రమే

By:  Tupaki Desk   |   13 Aug 2016 6:29 AM GMT
మంత్రిగారి సరదా ఖర్చు.. జస్ట్ కోటి మాత్రమే
X
ప్రజాధనానికి ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు.. ఎంత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనం.రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో మన ఆటగాళ్ల పేలవ ప్రదర్శన సంగతి తెలిసిందే. ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలు.. అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు.. వారికి మరింత పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేందుకు చేతులు రాని ప్రభుత్వాలు.. ఆటను చూసేందుకు డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయటం కనిపిస్తోంది.

ఓపక్క క్రీడాకారులకు చెల్లించాల్సిన స్టైఫండ్ ను నెలల తరబడి పెండింగ్ ఉంచిన రాష్ట్రంలో.. రియోలో జరుగుతున్న క్రీడా సంరంభాన్ని కనులారా చూసేందుకు సదరు రాష్ట్ర మంత్రివర్యులు రూ.కోటి ఖర్చు చేసేందుకు సిద్ధం కావటం హాట్ టాపిక్ గా మారింది. హర్యానా రాష్ట్ర మంత్రి అనిల్ విజ్.. మరో ఎనిమిది మంది సభ్యులున్న బృందం రియో వెళ్లేందుకు ప్లాన్ చేసింది.

భారతక్రీడాకారుల్ని ప్రోత్సహించటానికే తమ రియో పర్యటన అని చెబుతున్నప్పటికీ మంత్రిగారికి కానీ ఆయన వెళుతున్న వారికి కానీ క్రీడల్లో ఎలాంటి అనుభవం లేదు. ఆటల గురించి తెలీకున్నా.. ఆటగాళ్లను ప్రోత్సహించటానికి వెళుతున్నట్లు చెబుతున్న హర్యానా మంత్రిగారికి ఆటల మీద మక్కువ ఎక్కువని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. రియోకి వెళుతున్న మంత్రిగారి క్రీడాశాఖ.. ఆ రాష్ట్ర క్రీడకారులకు గడిచిన మూడు నెలలుగా ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వకుండా ఉండటమే దీనికి నిదర్శనం.

క్రీడాకారుల్ని ప్రోత్సహించటానికి.. వారికిచ్చే స్టైఫండ్ కు నిధుల సాకు చెప్పే అధికారులు.. మంత్రిగారు ఎంజాయ్ చేయటానికి రియోకి వెళతామంటే రూ.కోటి ఖర్చు సైతం ఓకే చెప్పటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియోలో పతకాలు రావటం లేదని క్రీడాకారుల్ని తిట్టిపోస్తాం కానీ.. ఇలాంటి నాయకుల నేతృత్వంలో ఆటగాళ్లు మాత్రం తమ ప్రతిభను ప్రదర్శించలేరు కదా..?