Begin typing your search above and press return to search.

మాల్ ప్రాక్టీస్ ను చట్టబద్ధం చేస్తారా?

By:  Tupaki Desk   |   30 March 2017 6:04 AM GMT
మాల్ ప్రాక్టీస్ ను చట్టబద్ధం చేస్తారా?
X
చంద్రబాబు త్వరలో మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఆమెకు ఛాన్సిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ.. ఆ ఎమ్మెల్యే మాటలు చూస్తుంటే మంత్రిగా ఉండాల్సిన అర్హతలు ఆమెకు ఉన్నాయా అన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాల్ ప్రాక్టీస్ తప్పు కాదన్నట్లుగా మాట్లాడడంతో ఈ చర్చ మొదలైంది.

ముఖ్యంగా చట్టాల విషయంలో ఎమ్మెల్యేకు అవగాహన ఉందా అని విపక్షాలు సందేహిస్తున్నాయి. తాజాగా టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ల లీకేజి విషయంలో శాసనసభలో పాలక, విపక్షాల మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టినా టీడీపీ నేతలు, స్పీకర్ అందుకు అంగీకరించలేదు. ఈ గొడవల నేపథ్యంలో సభ వాయిదా పడింది. ఆ తరువాత ఎమ్మెల్యే అనిత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు అవగాహన లేదని.. లీకేజికి, మాల్ ప్రాక్టీస్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎగ్జామ్ మొదలైన తరువాత ఓ అమ్మాయి ప్రశ్నాపత్రాలను బయటకు పంపించిందని .. అది మాల్ ప్రాక్టీస్ కిందకొస్తుందని అన్నారు. అదేమీ పెద్ద విషయం కాదని.. ఆ అమ్మాయి తెలియక అలా చేసిందని.. అది సాధారణమని అన్నారు.

ఎమ్మెల్యే మాటల ప్రకారం చూస్తుంటే మాల్ ప్రాక్టీస్ తప్పు కాదన్న భావన వ్యక్తమవుతోంది. పేపరు ముందుగా లీకయితేనే తప్పు కానీ, ఎగ్జామ్ మొదలైన తరువాత ఏం జరిగినా ఫరవాలేదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. చట్టసభ సభ్యురాలిగా ఆమె అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడుతారన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం తీరు చూస్తుంటే మాల్ ప్రాక్టీస్ ను చట్టబద్ధం చేసేలా ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/