Begin typing your search above and press return to search.

మాచర్ల ఎపిసోడ్ కొలిక్కి రాకముందే తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పు

By:  Tupaki Desk   |   18 Dec 2022 3:50 AM GMT
మాచర్ల ఎపిసోడ్ కొలిక్కి రాకముందే తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పు
X
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త రాజకీయ రగడను చూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రత్యేక సందర్భాల్లో తప్పించి.. రాజకీయంగా ఇలాంటి పరిస్థితుల్ని చూసింది లేదు. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అధిపత్య పోరు ఒక స్థాయిలో ఉండేది. కొంతకాలం తగ్గినట్లుగా కనిపించిన టీడీపీకి.. ఆ పార్టీ నేతలకు.. కార్యకర్తలకు జీవన్మరణ సమస్యగా మారింది. దీనికి తోడు ఎంత తగ్గితే అంతకు మించి తొక్కేసే ధోరణి పెరిగిపోవటం కూడా రాజకీయంగా ఎదుర్కోవటం అనే నిర్ణయానికి ప్రధాన ప్రతిపక్షం వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఆ మాటకు వస్తే.. అధికారపక్షానికి ఒక్క ప్రధాన ప్రతిపక్షంతోనే లొల్లి అనుకోవటానికి లేదు. తమను తప్పు పట్టేవారు.. తమ పాలనను వేలెత్తి చూపించేవారు.. విమర్శించే వారు ఎవరైనా సరే.. వారి సంగతి చూడటమే లక్ష్యమన్నట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అధికారపక్షానికి చెందిన నేతల తీరుతోనే అంతటి రగడ చోటుచేసుకున్నట్లుగా చెప్పటం తెలిసిందే. అదేమీ కాదు.. అదంతా కూడా కేవలం ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ నేతల కారణమేనని అధికారపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. వాస్తవాలు ఏమిటన్నది ఏపీ ప్రజలకు తెలిసిందే. మాచర్లలో రేగిన రాజకీయ మంటలు ఒక కొలిక్కి రాక ముందే.. దానికికాస్తంత దూరంగా ఉన్నప్పటికీ అదే జిల్లాకు చెందిన తెనాలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెనాలిలో ఉన్న అన్నా క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టటం కొత్త ఉద్రిక్తతకు కారణమైంది. అర్థరాత్రి వేళ అన్నా క్యాంటీన్ తలుపుల వద్ద నిప్పు పెట్టేసిన కొందరు దుండగులు పరారయ్యారు. దీన్ని గమనించిన వారు మంటల్ని గుర్తించి వాటిని అర్పేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ లకు మంగళం పాడించటం తెలిసిందే. అలా మూసి ఉన్న అన్నా క్యాంటీన్ కు నిప్పు పెట్టటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుందని చెబుతున్నారు.