Begin typing your search above and press return to search.

అన్నాడీఎంకే ప‌గ్గాలు చిన్న‌మ్మ చేతికేనా?

By:  Tupaki Desk   |   4 March 2022 7:32 AM GMT
అన్నాడీఎంకే ప‌గ్గాలు చిన్న‌మ్మ చేతికేనా?
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చెలిక‌త్తెగా అంద‌రికీ సుప‌రిచితురాలైన శ‌శిక‌ళ చేతికి అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు అంద‌నున్నాయా? ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకుని నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పేందుకు పార్టీ సిద్ధంగా ఉందా? అంటే త‌మిళ‌నాడు రాజ‌కీయ వర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌ను తిరిగి అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం అవుతుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

వ‌ర్గ‌పోరు.. వ‌రుస ఓట‌ములు

జ‌య‌ల‌లిత హ‌యాంలో ఓ వెలుగు వెలిగిన అన్నాడీఎంకే పార్టీ ఆమె మ‌ర‌ణం త‌ర్వాత మ‌స‌క‌బారింది. తిరుగులేని నాయ‌కురాలిగా ఎదిగిన జ‌య‌ల‌లిత రాష్ట్ర రాజ‌కీయాల్లో శ‌క్తిమంత‌మైన నేత‌గా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందారు. కానీ ఆమె మృతి త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగా త‌యారైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌ని స్వామి మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో పార్టీ రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. దీంతో గ‌త రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. డీఎంకే అధికారంలోకి రావ‌డంతో స్టాలిన్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో వ‌ర్గ‌పోరు, వ‌రుస ఓట‌ముల‌కు చెక్ పెట్టేందుకు శ‌శిక‌ళ‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాల‌ని అన్నాడీఎంకే వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ని స‌మాచారం.

అప్పుడు వ‌ద్ద‌ని..

జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆమెకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ‌.. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకేలో చ‌క్రం తిప్పుతార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ ప‌ళ‌ని స్వామి ప‌న్నీర్ సెల్వం ఆధిప‌త్య పోరాటంలో ఆమెకు అవ‌కాశం ద‌క్క‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అక్ర‌మ ఆర్జ‌న కేసులో జైలుకు వెళ్లి వ‌చ్చిన శ‌శిక‌ళ పార్టీ కార్యాక‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అంతా అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఆమె రాజ‌కీయ జీవితం ముగిసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకున్నారు. పార్టీలోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఆమె వ‌స్తే త‌మ ప్రాధాన్యం త‌గ్గుతుంద‌ని భావించిన ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం శ‌శిక‌ళ రాక‌ను ఒప్పుకోవ‌డం లేద‌ని తెలిసింది.

కానీ ఇప్పుడు శ‌శిక‌ళ రాక కోసం ప‌న్నీర్ సెల్వం ఎదురు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా పార్టీ కూడా చిన్న‌మ్మ చేతిలో అధికార బాధ్య‌త‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాయ‌ని తెలిసింది. ఈ విష‌యమై తేని జిల్లా కార్య‌వ‌ర్గం తీర్మానించి పార్టీ అధిష్ఠానానికి పంప‌నుంది. ఆ త‌ర్వాత మిగతా జిల్లాల్లోనూ ఇలాగే తీర్మానం ఆమోదిస్తార‌ని తెలుస్తోంది. పార్టీలో వివిధ వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ తానే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని అని ప్ర‌క‌టించుకున్న శశిక‌ళ తాజా ప‌రిణామంతో మ‌రింత దూకుడు పెంచ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు అన్నాడీఎంకే క‌లిసి గత ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని అంటున్నారు.