Begin typing your search above and press return to search.

ఈ నెల 30 నుండి రైతు సమస్యలపై అన్నా హజారే నిరశన దీక్ష ... !

By:  Tupaki Desk   |   29 Jan 2021 11:50 AM GMT
ఈ నెల 30 నుండి రైతు సమస్యలపై అన్నా హజారే నిరశన దీక్ష ... !
X
ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు వెల్లడించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తన సొంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో గాంధీ జయంతి రోజు అయిన జనవరి 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. తన మద్దతుదారులందరూ వారివారి ప్రదేశాల్లోనే నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా రైతుల సమస్యలపై తాను పోరాడుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 84 ఏళ్ల హజారే విమర్శించారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం వినడం లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించిన తమ డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు.
మూడు నెలల్లో ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి తాను ఐదు సార్లు లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతినిధులు తమతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ తాను 2018 మార్చి 13న నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని అన్నా హజారే గుర్తు చేశారు. ప్రధాని మంత్రి కార్యాలయం నాడు రాతపూర్వక హామీ ఇచ్చిందని.. కానీ, ఆ హామీని నేటికీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఫలితంగా మార్చి 29న మరోసారి దీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. 2019 జనవరి 30న మరోసారి దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.