Begin typing your search above and press return to search.

సీఎంను రాజ‌కీయ‌ గురువు త‌ప్పుప‌ట్టారు

By:  Tupaki Desk   |   6 Sep 2016 12:00 PM GMT
సీఎంను రాజ‌కీయ‌ గురువు త‌ప్పుప‌ట్టారు
X
జ‌న్‌ లోక్‌ పాల్ బిల్లు కోసం ఉద్య‌మించిన స‌మ‌యంలో త‌న పంచ‌న చేసి త‌ద్వారా ఒక్క సారిగా తెర‌మీద‌కు రావ‌డం...ఆన‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సీఎం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ పై సామాజిక ఉద్య‌మకారుడు అన్నా హ‌జారే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కేజ్రీ ప‌రిపాల‌కుడిగా మార‌డ‌టం వ‌ల్ల అద్భుతాలు సృష్టిస్తాడ‌ని పై తాను పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌ల‌య్యాయ‌ని అన్నారు. కేజ్రీవాల్ ప్ర‌భుత్వంలోని మంత్రులు - ఎమ్మెల్యేలు జైళ్ల‌కు వెళ్తుండ‌టం - అవినీతికి పాల్ప‌డుతుండ‌టంపై తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన‌ట్లు హ‌జారే వెల్ల‌డించారు.

మ‌హిళ‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన ఆరోప‌ణ‌ల‌పై ఆప్ ఎమ్మెల్యే సందీప్ కుమార్ అరెస్ట్ అవ‌డంపై హ‌జారే త‌న స్పంద‌న వెల్ల‌డించారు. "నా మ‌న‌సు తీవ్రంగా గాయ‌ప‌డింది.. కేజ్రీవాల్ నాతో ఉన్న‌పుడు గ్రామ్ స్వ‌రాజ్‌ పై ఓ పుస్త‌కం రాశారు. మ‌రిప్పుడు ఆయ‌న పాల‌న‌ను గ్రామ‌స్వరాజ్ అంటారా? ఇదే నాకు చాలా బాధ క‌లిగిస్తోంది. ఆయ‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం పోయింది" అని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీలోకి ఎలాంటి వ్య‌క్తులు వ‌స్తున్నారో చూసుకోవాల‌ని తాను ముందే కేజ్రీవాల్‌ ను హెచ్చ‌రించిన‌ట్లు హ‌జారే గుర్తు చేశారు. "నీవు పార్టీ పెట్టిన త‌ర్వాత దేశమంతా తిరుగుతావు. ర్యాలీలు నిర్వ‌హిస్తావు. కానీ నీ పార్టీలోకి వ‌చ్చే వ్య‌క్తులు మంచి గుణం క‌లిగి ఉన్న‌వారా లేదా అన్న‌విష‌యం ఎలా గుర్తిస్తావు?" అని తాను ప్ర‌శ్నించిన‌ట్లు హ‌జారే చెప్పారు. దానికి కేజ్రీవాల్ స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌ని, అదే ఇప్పుడు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అన్నారు. కేజ్రీవాల్ త‌న‌తో చాలా ఏళ్లు క‌లిసి ఉన్నార‌ని, ఆయ‌న‌పై త‌న‌కెంతో న‌మ్మ‌కం ఉండేద‌ని, దేశ రాజ‌కీయాల్లో కేజ్రీవాల్ ఏదో కొత్త‌గా చేసి దేశాన్ని ఓ కొత్త దిశ‌లో న‌డిపిస్తార‌ని న‌మ్మేవాడిన‌ని హ‌జారే తెలిపారు. అయితే ప్ర‌స్తుత ప‌రిణామాల‌తో ఆ న‌మ్మ‌కం పోయింద‌ని స్ప‌ష్టంచేశారు. నిష్క‌ల్మ‌ష‌మైన వ్య‌క్తిత్వం క‌లిగి ఉన్న హ‌జారే కేజ్రీవాల్‌ పై చేసిన విమర్శ‌లు ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల కంటే బ‌లంగా త‌ప్ప‌కుండా ప్ర‌భావం చూపుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.