Begin typing your search above and press return to search.

తమిళనాడు నోరు మూయించేందుకు కొత్త పాయింట్‌ దొరికింది..

By:  Tupaki Desk   |   10 April 2015 4:23 AM GMT
తమిళనాడు నోరు మూయించేందుకు కొత్త పాయింట్‌ దొరికింది..
X
శేషాచలం ఎన్‌ కౌంటర్‌ తో తమిళనాట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న టీడీపీకి ఇప్పుడు ఆ పార్టీ నేత ఒకరు ఆపద్భాంధవుడిలా కనిపిస్తున్నారు. నిజానికి ఈ సంఘటన నుంచి ఎలా డిఫెన్సు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న టీడీపీని కాపాడేలా ఆ పార్టీ నేత ఒకరు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఎర్రచందనం నరుకుతున్న 20 మందిని ఎన్‌ కౌంటర్‌ చేయడం తప్పయితే తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్‌ను చంపడం కూడా తప్పే అవుతుందని తెలుగుదేశం పార్టీ నేత అన్నా రామచంద్రయ్య తమిళనాడు ఆందోళనకారుల వద్ద వాదించారు. తమిళనాడు ప్రభుత్వం గంధపు చెక్కల స్లగ్లర్‌ వీరప్పన్‌ను చంపిందని... అలాంటప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్‌ కౌంటర్‌ చేస్తే తప్పేంటని ఆయన వాదించారు. శేషాచలంలో ఎర్రచందనం పరిరక్షణకు టాస్క్‌ఫోర్సు అధికారులు చర్యలు చేపట్టారని.. తమపై దాడి చేయబోయే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఇది తప్పంటే.. వీరప్పన్‌ను చంపడమూ తప్పే అవుతుందని ఆయన అన్నారు. ఎర్రచందనం చెట్లు నరికేందుకు అడవిలోకి వస్తే చంపేస్తామని 9 నెలల కిందటే తమిళనాడంతా హెచ్చరికలు చేశారని ఆయన గుర్తుచేశారు. అయినా వారు రావడం మానలేదని, అడ్డుకునే పోలీసులపై తిరగబడ్డారని చెప్పారు.

అక్రమార్కులను అడ్డుకునేందుకు చట్టాలు ఉన్నాయని వాదిస్తున్న తమిళ వర్గాలు వీరప్పన్‌, ఆయన అనుచరులను వెంటాడి వేటాడి ఎందుకు చంపారో కూడా చెప్పాలని రామచంద్రయ్య నిలదీశారు. రామచంద్రయ్యకు గుర్తుకొచ్చిన ఈ పాత అంశం ఇప్పుడు చాలామంది టీడీపీ నేతలకు మాట్లాడేందుకు అస్త్రంగా మారింది.