Begin typing your search above and press return to search.

పాక్ సెలబ్రిటీ స్టార్ ను హత్య చేసిన అన్నకు జైలు బయట ఘన స్వాగతం

By:  Tupaki Desk   |   16 Feb 2022 3:28 AM GMT
పాక్ సెలబ్రిటీ స్టార్ ను హత్య చేసిన అన్నకు జైలు బయట ఘన స్వాగతం
X
దాదాపు ఆరేళ్ల క్రితం పాక్ పూనంపాండేగా పేరున్న సోషల్ మీడియా సంచలనం క్వాందీల్ బలోచ్ ను ఆమె సొంత సోదరుడు దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే. హత్య తర్వాత తన సోదరి.. అశ్లీల ఫోటోల్ని.. వీడియోల్ని పోస్టు చేసి కుటుంబ పరువు మంట కలిపిందని.. అందుకే హత్య చేశానని చెప్పిన అతగాడి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారటంతో పాటు.. పెద్ద ఎత్తున ఖండనలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే.. అతగాడిని తాజాగా జైలు నుంచి శిక్షా కాలం పూర్తైన నేపథ్యంలో విడుదల చేస్తే.. అతడికి ఘన స్వాగతం పలుకుతూ.. పెద్ద ఎత్తున జైలు వద్దకు వచ్చిన మూక తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఇంతకీ క్వాందీల్ బలోచ్ ఎవరు? ఆమెను అతడి సోదరుడు ఎందుకు హత్య చేశాడు? తాను చేసిన హత్యపై అప్పుడే కాదు.. శిక్ష అనుభవించి జైలు నుంచి వచ్చిన వేళలోనూ పశ్చాతాపం పడని ఈ మగ పశువు వాదన ఏమిటి? అన్నది చూస్తే.. మహిళల్ని తొక్కిపెట్టాలన్న భావనను వ్యక్తం చేసే దుర్మార్గం ఇతగాడిలో కనిపిస్తుంది. డిజిటల్ యుగంలోనూ.. పరిమితుల పరదాల వెనుకే ఉంటామనే మహిళలకు ఇలాంటి వారి తీరును వ్యతిరేకిస్తూ బయటకు రావాల్సిన అవసరం ఉంది.

మన దగ్గర పూనంపాండే ఎలానో.. పాక్ లోనూ ఒక సోషల్ మీడియా స్టార్ ఉండేవారు. గ్లామర్ ఫోటోల్ని.. తన అందచందాల్ని ఆరబోస్తూ ఫోటోలు.. వీడియోలు చేయటం ద్వారా సంచలనంగా మారటమే కాదు.. సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకున్న మహిళ క్వాందీల్ బలోచ్. పాక్ లాంటి దేశంలో ఇలాంటి చర్యలు మహిళలు చేయటం చాలా తక్కువ. దీంతో ఆమె సంచలనంగా మారారు. తొలుత గ్లామర్ రసాన్ని పొంగించిన ఆమె.. తర్వాతి కాలంలో తనను తాను మార్చుకొని పలు అంశాలపై ఉద్యమాలు చేసి పోరాడింది. ఇదిలా ఉంటే 26 ఏళ్ల వయసులో ఆమెను.. సొంత అన్న 2016లో దారుణంగా హత్య చేశాడు.

అశ్లీల ఫోటోలు.. వీడియోలతో తమ కుటుంబ పరువు మంట కలిపిందని.. అందుకే తాను చంపేశానని.. హత్య చేసినందుకు తాను బాధ పడటం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు.. ఆమె హద్దులు దాటినట్లుగా పేర్కొంటూ ఆమె సోదరుడు వసీమ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారంగా మారటమే కాదు.. పలు దేశాలకు చెందిన సెలబ్రిటీలు.. తారలు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ హత్యపై మడోనా లాంటి ప్రముఖులు సైతం స్పందించి.. తప్పు పట్టారు. ఈ తీరును తీవ్రంగా ఖండించారు. ఇక.. పాక్ కోర్టులో ఈ కేసుకు జీవితఖైదు పడింది. కూతుర్ని చంపిన తమ కొడుకును క్షమించేది లేదని చెప్పిన తల్లిదండ్రులు.. తర్వాత కాలంలో క్షమించటంతో అతడి జైలుజీవితం ఆరేళ్లకు తగ్గిపోయింది.

తాజాగా అతని శిక్షా కాలం పూర్తి కావటంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. తన తీరును సమర్థించుకోవటమే కాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన సోదరిని హత్య చేసినందుకు తాను గర్వంగా ఫీల్ అవుతున్నానని.. తనను భావితరాలు గుర్తు పెట్టుకుంటాయన్నారు. అమ్మాయిలు పుట్టేది ఇంట్లో ఉండేందుకేనని.. వారు సంప్రదాయాలు పాటించాలని.. ఆ విషయంలో దారి తప్పితే వసీమ్ లాంటి హీరోలు పుట్టుకొస్తారంటూ.. అతనికి స్వాగతం పలికిన సందర్భంగా పలువురు ఈ తరహా బ్యానర్లు.. ఫ్లెక్సీలు ప్రదర్శించటం విశేషం. జైలు నుంచి బయటకు వచ్చిన వసీంను అక్కడి వారు హీరోగా అభివర్ణిస్తున్నారు.

అయితే.. తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన కొడుకును తమ ఇంట్లోకి రానిచ్చేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేయటంతో.. వసీం బయట ఉంటున్నాడు. ఈ తరహా దరిద్రపుగొట్టు హీరోలను జన్మనిచ్చిన తల్లిదండ్రులు క్షమించకున్నా.. పిచ్చ జనాలు కొందరు మాత్రం హీరోగా వర్ణిస్తున్న వైనం చూస్తే.. ఒళ్లు జలదరింపుకు గురి కావటం ఖాయం.