Begin typing your search above and press return to search.

వందేళ్ల తర్వాత కెనడా నుండి కాశీకి అమ్మవారి విగ్రహం .. !

By:  Tupaki Desk   |   11 Nov 2021 5:30 PM GMT
వందేళ్ల తర్వాత కెనడా నుండి కాశీకి అమ్మవారి విగ్రహం .. !
X
కాశీలో వందేళ్ల క్రితం దొంగిలించబడిన అన్నపూర్ణాదేవి విగ్రహం మళ్లీ అతి త్వరలో యథాస్థలానికి చేరుకుంటోంది. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఢిల్లీలో కేంద్రం చేతుల మీదుగా అందుకున్న యూపీ ప్రభుత్వం కాశీలో ప్రతిష్ఠించనుంది. వందేళ్ల కిందట దొంగిలించబడి, మొన్నటివరకు కెనడాలో ఉన్న విగ్రహాన్ని ప్రధానమంత్రి, వారణాసి ఎంపీ నరేంద్రమోడీ ఇటీవలే ఇండియాకు తెప్పించారు. స్వతంత్రం రాకముందే మనదేశంలో ఎన్నో విలువైన విగ్రహాలు, కళాఖండాలు, పురాతన వస్తువులను విదేశాలకు దోచుకెళ్లారు. ఈ క్రమంలోనే కెనడా నుంచి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్రం భారత్‌ కు తిరిగి తేవడంలో కీలకమైన కృషి చేసింది.

ఢిల్లీలో అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించింది కేంద్ర సాంస్కృతిక శాఖ. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా యూపీ ప్రభుత్వానికి 18వ శతాబ్దం నాటి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఢిల్లీలో అందజేశారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ జైపూర్ హౌస్‌లో ఘనంగా విగ్రహం అప్పగింత కార్యక్రమం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రులు మీనాక్షి లేఖి, అర్జున్ రామ్ మేగ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్, హార్డీప్ సింగ్ పూరి, స్మృతి ఇరానీ, మహేంద్ర నాథ్ పాండే, బిల్ వర్మతో సహా పలువురు మాజీ ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రులు సురేష్ రాణా, నీలకంట్ తివారి సహా పలువురు అన్నపూర్ణ విగ్రహాన్ని అందుకున్నారు. వందేళ్ల క్రితం వారణాసి నుంచి ఈ విగ్రహం దొంగిలించబడింది. నవంబర్ 15వ తేదీన కాశీ విశ్వనాథ ఆలయంలో అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్. అక్టోబర్ 15వ తేదీన కెనడా నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విగ్రహాన్ని అందుకున్నారు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. సాక్షాత్ పరమశివుడికే ఆహారాన్ని కాశీ అన్నపూర్ణ భిక్షగా వేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ దేవి ఉంటే ఆకలి బాధలు ఉండవని నమ్ముతారు.

ఇక ఇదిలా ఉంటే .. దక్షిణ అయోధ్య భద్రాచలంను రామాయణ సర్క్యూట్‌ లో చేరుస్తున్నామని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. భద్రాచలం వద్ద భక్తుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. భద్రాచలం విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖతో మాట్లాడారని తెలిపారు. రామాయణ సర్క్యూట్‌ లో ఏపీలోని అంజనాద్రిని చేర్చెందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందుకు వస్తే పరిశీలిస్తామని తెలిపారు.

వందల ఏళ్ల కింద దేశం నుంచి కెనడా తరలిపోయిన అన్నపూర్ణ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అప్పగించామని , ఏపీకి సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే రాష్ట్రానికి విగ్రహం ఇస్తామని వెల్లడించారు. వందల ఏళ్ల కిందట దేశం నుంచి అనేక విగ్రహాలు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని ,వాటిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.